ఆస్కార్ అవార్డు తీసుకుని భారత చలన చిత్ర చరిత్రలో సంచలనం సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ను ప్రముఖ నేపథ్యగాయని పి.సుశీల మారియట్ హోటల్‌లో నేడు సత్కరించనున్నారు. ఈ సందర్భంగా మారియట్ కన్ వెన్ సన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పి. సుశీల మాట్లాడుతూ "ప్రస్తుతం నడుస్తున్నది రెహమాన్ యుగం అనవచ్చు. ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చిందని తెలిసిన వెంటనే ఆయనను మా కళాకారులంతా సన్మానించాలనుకుంటున్నాం అని ఆయనకు తెలియజేసినపుడు ఇటువంటి వాటికి నేను దూరంగా ఉంటాను కాని ఎక్కడైనా ఇండోర్‌లో అయితే ఫరవాలేదని చెప్పాను. దానికి మా కోడలు సంధ్య సహకారంతో మారియట్ కన్‌వెన్‌సన్ సెంటర్ ప్రతినిధి కాలిన్స్‌ను కలవడం జరిగింది. ఆయన చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి టియంసి అమర్‌నాథ్ ముందుకు రావడం, ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి చేరవేయడం కోసం 'మా టివి" లో ప్రసారం చేయడానికి ఆ సంస్థ సిఇఒ తపస్ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు రహమాన్ గారిని సన్మానించే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది" అన్నారు. సుశీల కోడలు సంధ్య మాట్లాడుతూ "నేను గాయనిగా రెహమాన్ గారి 'ఇద్దరు" చిత్రంతో పరిచయం అయ్యాను. ఈ రోజు ఆయనను సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం" అన్నారు.