ధోనీ సినిమా: మరి రామ్ చరణ్ లుక్ ఎప్పుడో?
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో. ‘ఎంఎస్ ధోని' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ధోనీ భార్య సాక్షి సింగ్ ఈ పోస్టర్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది.

తాజాగా ధోని ఫ్యాన్స్ క్లబ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధోనీ అవతారంలో ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫోటో విడుదల చేసారు. ఇందులో సుశాంత్ ధోని తొలినాళ్లలో ఉన్నట్లు లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఆయన ఇందులో ధోని క్లోజ్ ఫ్రెండ్ సురేష్ రైనా పాత్రలో కనిపించబోతున్నాడట. టీమిండియా క్రికెట్లో ధోనీ, రైనా మధ్య మంచి అనుబంధం ఉంది. వారి స్నేహ బంధాన్ని ధోని తెరపై ఆవిష్కరించబోతున్నారట. మరి రామ్ చరణ్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారో? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

ఈ చిత్రం 2015లో విడుదలయ్యే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర హక్కుల కోసం ధోనికి 40కోట్ల భారీ మొత్తాన్ని ముట్టజెప్పారనే వార్తలు వినిపించాయి. ఇటీవల క్రీడాకారుల జీవితాలపై తీసిన....‘భాగ్ మిల్ఖా భాగ్', ‘మేరీ కోమ్' లాంటి చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దేశంలో క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్యే ఎక్కువ కాబట్టి ఈ చిత్రానికి భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











