ప్రధాని మోదీకి సుశాంత్ సోదరి లేఖ: మాకు గాడ్ ఫాదర్ లేరు.. మీరే న్యాయం చేయండి అంటూ
సుశాంత్ మరణం తర్వాత మౌనం దాల్చిన ఆయన కుటుంబం ఇప్పుడిప్పుడే దర్యాప్తు తీరుపై స్పందిస్తున్నారు. పాట్నాలో తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత తాజాగా సోదరి శ్వేతా సింగ్ కృతి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. తన సోదరుడి మృతి కేసులో న్యాయం జరిగేలా చూడాలని లేఖ రాశారు. తాజాగా శ్వేతా సింగ్ లేఖ రాయడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ లేఖ గురించి వివరాల్లోకి వెళితే..

నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తుపై తమకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవాలి. సాక్ష్యాలను రూపుమాపకుండా చర్యలు తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయండి. సుశాంత్ మరణం వెనుక వాస్తవాలు బయటకు వచ్చేలా నిష్పక్షపాతమైన విచారణ చేపట్టేలా ఆదేశాలు జారీ చేయండి అంటూ శ్వేతా సింగ్ సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీని వేడుకొన్నారు.

భారతీయ చట్టాలపై అపారమైన నమ్మకం
ప్రధాని మోదీని వేడుకొంటూ సోషల్ మీడియాలో శ్వేతా సింగ్ కృతి పోస్టు పెట్టారు. నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరిని. అత్యవసరంగా ఈ కేసుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. నాకు భారతీయ చట్టాలపై అపార నమ్మకం ఉంది. నా సోదరుడి మరణం కేసులో మాకు న్యాయం జరగాలి అంటూ ట్వీట్ చేశారు.

నిజాలు ప్రపంచానికి తెలియాలి
సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ తన పోస్టుతోపాటు ఓ లేఖను ప్రధాని మోదీకి రాశారు. తన లేఖలో.. నా సోదరుడి మరణం విషయంలో నిజాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మాకు అండగా నిలుస్తారని నా హృదయం చెబుతున్నది. నా సోదరుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు అతడికి ఎవరూ గాడ్‌ఫాదర్ లేరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో శ్వేతా సింగ్ పేర్కొన్నారు.
Recommended Video

సాక్ష్యాలు తారుమారు కాకుండా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక కారణాలకు జరుగుతున్న దర్యాప్తులో లోపాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు కాకుండా, స్వచ్ఛమైన రీతిలో విచారణ జరిగేలా చూడండి. ఈ కేసులో మీరు జోక్యం చేసుకోవాలని వేడుకొంటున్నాం. ఈ దర్యాప్తు సరైన దిశలో సాగేలా చర్యలు తీసుకోండి. మాకు న్యాయం జరిగేలా చూడండి అంటూ శ్వేతాసింగ్ తన లేఖలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











