సీన్స్ కట్ చేసారని ఆవేదనతో ఆత్మహత్య
హైదరాబాద్ : సినిమాల్లో కనిపించాలనే ఆత్రం, నిరీక్షణ, ఆశాభంగం ఓ యువకుడి ప్రాణం తీసాయి. సినిమాల్లో తనపై చిత్రీకరించిన సన్నివేశాలకు కత్తెర పడటాన్ని తట్టుకోలేక తమిళనాడుకు చెందిన తెలుగు యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తూత్తుకుడి జిల్లా తిరుచ్చెంగోడుకు చెందిన శ్రీనివాసరావు-రాజేశ్వరి దంపతుల పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కడప.
వీరి పెద్ద కొడుకు చంద్రశేఖర్‌రావు(25). ఇతనికి చిన్నతనం నుంచి సినిమా పిచ్చి. నటుడు కావాలన్న ఆశతో ఇంజినీరింగ్ పూర్తి చేసి సినిమా అవకాశాల కోసం చెన్నైకు వచ్చాడు. చంద్రశేఖర్‌రావు నిరీక్షణ ఫలిస్తూ రెండు కొత్త చిత్రాల్లో చిన్నపాటి పాత్రల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ రెండు చిత్రాలు నెలరోజుల కిందట విడుదల కాగా, ఇతను నటించిన సన్నివేశాలు మాత్రం అందులో లేవు. దీంతో ఆవేదనకు గురై ఇంటి నుంచి బయటకు రావడం మానేశాడు.
ఈ నేపథ్యంలో కుటుంబీకులు గత శనివారం ఓ శభకార్యంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం చంద్రశేఖర్‌రావును ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫలితం లభించలేదు. ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. ఆయన తలుపులు బద్దలు కొట్టి చూడగా చంద్రశేఖర్‌రావు తాడుకు వేలాడుతూ కనిపించాడు.


Click it and Unblock the Notifications












