"సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లయితే, ఎస్వీఆర్ గుండెకాయ"
'తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లు రెండు కళ్లు అయితే... ఎస్వీ రంగారావు గుండెకాయ'' అని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎస్వీ రంగరావు శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దేశ సినీజగత్తులో ఎస్వీ రంగారావు పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.
భాషకు, భావానికి, హావభావాలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రతి పాత్రకు జీవం పోసిన ఆయన నటనాకౌశల్యం అనితర సాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రతినాయక పాత్రల్లోనే కాకుండా, క్యారక్టర్ ఆర్టిసుగానూ ఆయన మెప్పించారని, విలన్ పాత్రలు పోషించిన నటులపై మనకు వ్యతిరేక భావన కలుగుతుంటుంది. కానీ ఎస్వీ రంగారావుని రావణుడిగా, కీచకుడిగా, కంసునిగా ఇలా రకరకాల పాత్రల్లో చూసినా వ్యక్తిగతంగా ఆయనపై భక్తిభావం, ఆరాధాన కలుగుతుందని వెల్లడించారు.

ఆయన తన నటనతో పాత్రలకే ఛాలెంజ్ విసిరారు. కృష్ణుడు అనగానే ఎన్టీఆర్ ఎలా గుర్తుకొచ్చినట్లే... ఘటోత్కచుడంటే ఎస్వీఆరే గుర్తుకొస్తారు. నటుడిగా ఎంత ఎత్తుకి ఎదిగినా, తన నటనలో పరిపూర్ణత రాలేదని చెప్పుకొనేవారు. అది ఆయన గొప్పతనమని వెంకయ్య చెప్పుకొచ్చారు.
వర్తమాన నటుల్లో అందం ఉంది కానీ, అందమైన నటన కనబడటం లేదని వెంకయ్య వ్యాఖ్యానించారు. నవరసాలను పండించడంలో ఆయనకే ఆయనే సాటి, ఇప్పటి నటులు ఎస్వీఆర్ సినిమాలను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.


Click it and Unblock the Notifications











