మహేష్-వెంకీ Svsc షూటింగ్ ప్రారంభం
మహేష్ బాబు-వెంకటేష్ జంటగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీ స్టారర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సరసన సమంతను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే వెంకీ సరసన అమలపాల్ ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నా ఇంకా ఖశ్చితమైన సమాచారం లేదు. మిక్కజే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి తాజా వివరాల విషయానికొస్తే..... సినిమా షూటింగ్ ఈ రోజే(జనవరి 18) ప్రారంభం అయింది. ప్రస్తుతం వెంకటేష్ పై వైజాగ్‌లో పాట చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ కావడంతో సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వచ్చే వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
మహేష్ బాబు నటించిన తాజా సినిమా 'బిజినెస్ మేన్' ఈ సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడం, సినిమా అందరినీ ఆకట్టుకోడంతో తొలి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. వెంకీ బాడీగార్డ్ సినిమా కూడా ఇదే సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్టయింది.


Click it and Unblock the Notifications











