సినిమాకు దిష్టి బాగా తగిలింది : మహేష్ బాబు
విజయవాడ : సాధారణంగా సినిమాలో ఒక పెద్ద హీరో ఉంటేనే దిష్టి తగులుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఇద్దరు హీరోలు ఉండటం వల్ల దిష్టి ఎక్కువ తగిలింది. అందుకే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కాస్త లేటయిందని చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
విజయవాడలో ఓ జ్యువెలరీ షాపు ఓపెనింగు కార్యక్రమానికి హాజరైన మహేష్ బాబు....పనిలో పనిగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈకార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు, మీడియా అడిగిన ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానం ఇచ్చారు.
వెంకటేష్ గారితో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన వద్ద నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పిన మహేష్ బాబు... ఈ సినిమా స్ర్కిప్టుపై వెంకటేష్ గారికి ఉన్నంత నాలెడ్జ్ మరెవ్వరికీ లేదన్నారు. ఈ సినిమాను మల్టీ స్టారర్ అని పిలవడం నాకు ఇష్ట లేదు, ఇదో గొప్ప సినిమా అంటూ మహేష్ బాబు కితాబిచ్చారు. వాస్తవానికి నేను ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి రాలేదని, గొప్ప సినిమాను ఎంతో గొప్పగా ఆదరిస్తున్న అందరికీ థాంక్స్ చెప్పడానికే వచ్చానని వెల్లడించారు. ప్రేక్షకులు పైరసీని ప్రోత్సహించ వద్దని, అంతా సకుటుంబ సపరివారంగా థియేటర్‌కు వెళ్లి చూడాలని ఆకాక్షించారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...సినిమాకు కలెక్షన్లు అదరిపోతున్నాయని, ఇద్దరు హీరోలు కలిసి నటించడం వల్లనే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ట్రెండ్ సెట్టర్ అయిందని, శ్రీకాంత్ లాగా దర్శకులు ఎవరైనా ఇలాంటి మంచి కథలు తెస్తే మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తామన్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ....వెంకటేష్, మహేష్ బాబులు చాలా బాగా కోఆపరేట్ చేసారని, ఈ ప్రాజెక్టు ఇంత అందంగా రావడానికి దిల్ రాజే కారణం, ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు హిట్ చేయడం వల్ల మరిన్ని మంచి సినిమాలు చేయాలనే కాన్ఫిడెన్స్ పెరిగిందన్నారు.


Click it and Unblock the Notifications











