నిఖిల్ 'స్వామి రారా' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్: నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన 'స్వామి రారా' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లక్ష్మీనర్సింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతకాంపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. ఈ సినిమాకు దర్శకుడు సుధీర్ వర్మ. చక్రి చిగురుపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రం నిర్మాణం పూర్తయింది.
దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ... అసలే దొంగ. ఆపై ప్రేమలో పడ్డాడు. ప్రేయసి కూడా.. 'దొరికిందంతా దోచేయ్.' అని ప్రోత్సహించే రకం. ఆ ఉత్సాహంలో మరింత రెచ్చిపోయాడు. కంటికి కనిపించిందల్లా జేబులోకి తోసేశాడు. వీరిద్దరూ కలసి చేసిన హంగామా ఎలాంటిదో తెలియాలంటే మా సినిమా చూడండి అన్నారు. సరదాగా సాగే ప్రేమకథ ఇది. నిఖిల్ అల్లరి నటన.. తప్పకుండా ఆకట్టుకొంటుంది. వినాయకుడి విగ్రహానికీ, ఓ దొంగ ప్రేమ కథకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం అన్నారు.
నిర్మాత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ... లవ్ విత్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన స్వామి రారా పక్కా కమర్షియల్ చిత్రమని ,క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఓ వినాయకుడి చుట్టూ తిరిగే కథ స్వామి రారా చిత్రమని, 22వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. నిఖిల్‌తో వీడు తేడా చిత్రాన్ని నిర్మించిన తాము అతనితో మరో చిత్రం చేయడం ఆనందంగా ఉందని సహ నిర్మాత సందీప్ కొరటాల అన్నారు. అన్ని వర్గాల ప్రజనలను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రవిబాబు, ప్రవీణ్, జీవా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సన్ని సంగీతాన్ని సమకూర్చారు. కెమెరా రిచర్జ్ ప్రసాద్. కృష్ణచైతన్య పాటలు రాశారు. ఆర్ట్ నాగేంద్ర. ఎడిటింగ్ ఎస్ఆర్ శేఖర్. సమర్పణ శంకర్ చిగురుపాటి, రచన, దర్శకత్వం సుధీర్ వర్మ.


Click it and Unblock the Notifications











