చిరు ‘స్వయం కృషి’ సిల్వర్ జూబ్లీ
హైదరాబాద్ : మెగాస్టర్ చిరంజీవి, కళా తపస్వి కె.విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన 'స్వయం కృషి' సినిమా ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన సినిమా అది. చిరంజీవి అభినయ సామర్థ్యానికి తార్కాణంగా నిలిచిన సినిమాల్లో కీలకమైనది. 1987 సెప్టెంబర్ 3న విడుదలై ఈచిత్రం నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం కమర్షియల్‌గానూ చెప్పుకోదగ్గ విజయం సాధించింది. 25 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం ఇందుకు నిదర్శనం. సాంబయ్య పాత్రలో తను ప్రదర్శించిన అభినయానికి గాను తొలిసారి ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్నారు చిరంజీవి.
ఇటు సంప్రదాయాన్నీ, అటు అభ్యుదయాన్నీ మేళవించి అరుదైన కళాఖండాల్ని తెలుగు చిత్రసీమకు అందించిన ఖ్యాతి దర్శకుడు కె విశ్వనాథ్‌ది. ఆయన మేధలోంచి వచ్చిన అలాంటి మరో ఆణిముత్యం 'స్వయంకృషి'. రోడ్డు పక్కన రావి చెట్టుకింద చెప్పులు కుట్టుకునే సాంబయ్య అనే చర్మకారుడు 'స్వయంకృషి'తో రాయల్ షూమార్ట్ అధినేత సాంబశివరావు స్థాయికి ఎలా ఎదిగాడనే కథను విశ్వనాథ్ తనకే సాధ్యమైన కళాత్మక శైలితో రూపొందించారు. సర్వజనామోదం సాధించారు. వ్యక్తిత్వ వికాసానికీ, బాలల మనస్తత్వానికీ అద్దంపట్టేలా విశ్వనాథ్ ఈ చిత్రాన్ని మలచడం ఇక్కడ చెప్పుకోదగ్గ మరో అంశం.
ఈ చిత్రంలో తను మనసారా ప్రేమించిన శారదాంబ (సుమలత) తన ప్రేమను తెలుసుకోకుండా భాస్కర్ (సర్వదమన్ బెనర్జీ)ని పెళ్లిచేసుకోవడంతో చిరంజీవి మందుకొట్టి కుమిలిపోతాడు. 300 అడుగులు ఉండే ఆ సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లోఓకేచేసి దర్శకుడితో సహా సెట్స్‌మీదున్న అందర్నీ అబ్బురపరిచారు చిరంజీవి.
విశ్వనాథ్ దర్శకత్వంలో రమేశ్‌నాయుడు సంగీతం సమకూర్చిన ఏకైక చిత్రం కూడా ఇదే. సి. నారాయణరెడ్డి, సీతారామశాస్త్రి రాసిన పాటల్లో 'సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి', 'పారా హుషార్... పారా హుషార్', 'చిన్నీ చిన్నీ కోరికలడగ' వంటివి ఇప్పటికీ సంగీత ప్రియుల నాలుకల మీద నర్తిస్తూనే ఉన్నాయి. మాస్కో చలన చిత్రోత్సవంలో ప్రదర్శితం అయిన ఈచిత్రం రష్యాలోకి అనువాదమై అక్కడ మంచి విజయం సాధించింది కూడా..


Click it and Unblock the Notifications











