‘సైరా’ కోసం... 7 ఎకరాల్లో కళ్లు చెదిరే భారీ సెట్ వేశారు
మెగస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో శర వేగంగా జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కోకాపేట్ దగ్గర 7 ఎకరాల్లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 40 రోజుల పాటు ఇక్కడ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.
స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ విషయానికొస్తే వచ్చే ఏడాది మే 9న ఉండొచ్చని భావిస్తున్నారట. చిరంజీవి కెరీర్లో ఎవర్ గ్రీన్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'గ్యాంగ్ లీడర్' గతంలో మే 9వ తేదీనే విడుదలయ్యాయి. దీంతో పాటు ఈ డేట్ సమ్మర్ హాలిడేస్ సీజన్ కావడం కూడా బాగా కలిసొచ్చే అంశం.

కాగా... 'సైరా' బడ్జెట్‌లో ఎక్కువ శాతం గ్రాఫిక్స్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ వర్క్ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్టు ప్రొడక్షన్ పనులు, విఎఫ్ఎక్స్ పనులు మొదలు పెట్టాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











