సైరా చిత్రం బయోపిక్ కాదు.. సెన్సార్ ఇంకా ఇవ్వలేదు.. హైకోర్టుకు తెలిపిన డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'సైరా నరసింహా రెడ్డి' వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఓ పక్క సైరా యూనిట్ గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా, మరోపక్క ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయులు పెద్దఎత్తున ఆదోళనలకు దిగుతున్నారు. దీంతో ఈ ఇష్యూ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మా రక్తంతో కోట్లలో వ్యాపారం చేస్తున్నారంటూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులు కొద్దిరోజులుగా తీవ్ర ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. సినిమా కథ విషయంలో తమకు హక్కులు ఉంటాయని తాము డిమాండ్ చేయగా.. గతంలో కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ తమతో ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, తీరా సినిమా పూర్తయ్యాక మోసం చేస్తున్నారనేది ఉయ్యాలవాడ వంశీయుల ప్రధాన ఆరోపణ. ఈ మేరకు వారు ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు.

అప్పట్లో మా కుటుంబంతో రామ్ చరణ్ స్వయంగా మాట్లాడి నోటరీపై 22 మందితో సంతకాలు చేయించారని, ఆ ప్రకారంగా తమకు 50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 'సైరా నరసింహా రెడ్డి' యూనిట్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఉయ్యాలవాడ వంశీయులు. ఈ పిటిషన్‌లో అమితాబ్ బచ్చన్ పేరు కూడా ప్రసావించడం విశేషం. అయితే తాజాగా ఈ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు చిత్రయూనిట్, సెన్సార్ బోర్డు నుంచి స్పందన తెలుసుకుంది.
ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు.. ఇంకా సైరా సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయలేదని కోర్టుకు తెలిపారు. సోమవారం లోపు తమ నిర్ణయం కోర్టుకు చెబుతామని తెలిపింది సెన్సార్ బోర్డు. అదేవిధంగా సైరా చిత్రం బయోపిక్ కాదని చిత్ర డైరెక్టర్ హైకోర్టుతో చెప్పడం విశేషం. దీంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.


Click it and Unblock the Notifications











