Mr. Pregnant Twitter Review: ఊహించని విధంగా మిస్టర్ ప్రెగ్నెంట్.. మరి సోహెల్ హిట్ కొట్టాడా అంటే!
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయాడు సయ్యద్ సోహెల్ రియాన్. కానీ, బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఫుల్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు. దీని తర్వాత ఏకంగా హీరోగా వరుస పెట్టి సినిమాలను కూడా చేసుకుంటూ వెళ్తోన్నాడు. కానీ, ఇప్పటి వరకూ ఒక్క విజయాన్ని కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సోహెల్ తాజాగా 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే సినిమాతో వచ్చాడు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మూవీ ట్విట్టర్ రివ్యూను మీరే చూడండి!
మిస్టర్ ప్రెగ్నెంట్ అంటూ: సయ్యద్ సోహెల్ రియాన్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'మిస్టర్ ప్రెగ్నెంట్'. శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించిన ఈ మూవీలో రూపా కొడువాయూర్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీని మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవి రెడ్డి నిర్మించారు. దీనికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇందులో సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, వైవా హర్ష, అభిషేక్‌లు నటించారు.

అలాంటి కథ.. ఎమోషన్: భార్య పిల్లలు కనడానికే ఇష్టపడని ఓ వ్యక్తి.. ప్రకృతికి విరుద్ధంగా ప్రెగ్నెంట్ అవడం.. ఆ తర్వాత సమాజం నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం.. గర్భంతో ఉన్న సమయంలో చాలా సమస్యల్లో చిక్కుకోవడం వంటి అంశాలతో తెరకెక్కిన చిత్రమే 'మిస్టర్ ప్రెగ్నెంట్'. పూర్తి స్థాయి ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది.
సీట్ల నుంచి లేవలేరు: 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు తన పోస్టు 'ఇప్పుడే 'మిస్టర్ ప్రెగ్నెంట్' ప్రీమియర్ షోను చూశాను. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి ఈ సినిమాను చూసే విధంగా ఉంది. కాన్సెప్టు చాలా కొత్తగా ఉంది. ప్రేక్షకులను ఈ సినిమా చూస్తున్నంత సేపు సీట్లలో నుంచి అస్సలు లేవలేరు' అంటూ ట్వీట్ చేశారు.
ప్రశంసనీయ చిత్రం: సోహెల్ నటించిన 'మిస్టర్ ప్రెగ్నెంట్' మూవీ వీక్షించిన మరో నెటిజన్ 'MrPregnant ప్రశంసనీయ ప్రయత్నం. మంచి ఎమోషనల్ జర్నీ. దర్శకుడు శ్రీనివాస్ అన్ని పాళ్లు మేళవింపుతో తెరకెక్కించాడు. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేసిన నిర్మాతకు అభినందనలు. సోహైల్ వన్ మ్యాన్ షో. రూపా బాగా చేసింది. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ' అని చెప్పుకొచ్చారు.
ఎమోషనల్ మూవీ: 'మిస్టర్ ప్రెగ్నెంట్' మూవీని చూసిన మరో నెటిజన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్‌లో 'మిస్టర్ ప్రెగ్నెంట్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న డీసెంట్ మూవీ. సోహెల్ తనదైన నటనతో జీవించేశాడు. రూపా గ్లామర్‌తో పాటు నటన పరంగానూ ఆకట్టుకుంది. సుహాసిని గౌరవప్రదమైన పాత్రను చేశారు. బ్రహ్మాజీ కామెడీ ట్రాక్ హిల్లీరియస్‌గా నడిచింది' అని చెప్పారు.
పురుషుడు నివాళి: 'మిస్టర్ ప్రెగ్నెంట్'పై అదే నెటిజన్ 'సినిమా సెకండాఫ్ మిమ్మల్ని నవ్విస్తుంది. ఎమోషనల్‌గా గుండె బరువెక్కేలా చేస్తుంది. దర్శకుడు శ్రీనివాస్ క్లిష్టమైన పాయింట్‌తో మంచి ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా ఫ్యామిలీ, యూత్ సెక్షన్‌లు చూడొచ్చు. చివరగా MrPregnant అనేది మాతృత్వానికి పురుషుడి ఇచ్చే గౌరవం' అంటూ వివరణాత్మకంగా వెల్లడించారు.

మొత్తం అదే టాక్: ఇక, 'మిస్టర్ ప్రెగ్నెంట్' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లను బట్టి చూస్తే.. దీనికి అంతటా పాజిటివ్ టాక్ వచ్చినట్లు అర్థం అవుతుంది. ఫస్టాఫ్‌లో కాస్త నెమ్మదిగా ఉన్నా.. ఆ తర్వాత ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసేలా సినిమా సాగుతుందని అంటున్నారు. మొత్తంగా ఈ చిత్రం సోహెల్‌కు నటన పరంగా మంచి మార్కులు తెచ్చే విధంగా ఉందని చెబుతున్నారు. మరి కమర్షియల్‌గా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











