తెలంగాణ బిల్లు ఆమోదంతో మళ్లీ సినిమా కష్టాలు!
హైదరాబాద్: తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అదే సమయంలో సీమాంద్ర ప్రాంతంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. తెలంగాణ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ పలు రాజకీయ పార్టీలు బంద్ పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి ఆందోళన కరంగా మారింది. సీమాంధ్ర జిల్లాల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 21న నాని నటించిన 'ఆహా కళ్యాణం', సునీల్ నటించిన 'భీమవరం బుల్లోడు', అలీ నటించిన 'అలీ బాబా ఒక్కడే దొంగ', అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర నటించిన 'నా రాకుమారుడు' చిత్రాలకు ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సినిమాలపై ఆ ప్రభావం పడుతుందా? అనేది సినిమా ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 21న విడుదల కావాల్సిన సునీల్ నటించిన 'భీమవరం బుల్లోడు' చిత్రాన్ని మరో వారం ఆలస్యంగా ఫిబ్రవరి 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇతర సినిమాలు కూడా ఇదే బాట పడతాయా? లేదా? అనేది చూడాలి.
నాని, వాణి కపూర్ జంటగా తెలుగు, తమిళంతో తెరకెక్కుతున్న చిత్రం 'ఆహా కళ్యాణం'. హిందీలో హిట్టయిన బ్యాండ్ బాజా భారత్ చిత్రానికి రీమేక్‌గా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ సౌత్ లో నిర్మిస్తున్న తొలి సినిమా ఇదే. ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. తమిళ,తెలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధరణ్ కుమార్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
సునీల్, ఏస్తర్ హీరో హీరోయిన్లుగా ఉదయశంకర్ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న 'భీమవరం బుల్లోడు'. అలీ కథానాయకుడుగా కమల్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డెడ శివాజీ రూపొందిస్తున్న చిత్రం 'అలీ బాబా ఒక్కడే దొంగ'.


Click it and Unblock the Notifications












