తాప్సీ 'మొగుడు' ఏం చేస్తున్నాడు?
మొగుడు హోదా అనేది మూడు ముళ్లు వేసేస్తేనో, ఏడడుగులు నడిచేస్తేనో వచ్చేయదు. భార్య మనసులో చోటు సంపాదించుకున్న మగాడే మొగుడు అనిపించుకోగలుగుతాడు అనే ఆసక్తికర కథాంశంతో... వినోదాత్మకంగా, భావోద్వేగ ప్రధానంగా రూపొందుతోన్న చిత్రం మొగుడు . కృష్ణవంశీ, గోపీచంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'మొగుడు'. తాప్సీ, శ్రద్ధాదాస్ ఇందులో నాయికలు. డా.రాజేంద్రప్రసాద్ కీలక పాత్రధారి. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ మాట్లాడుతూ "కృష్ణవంశీ శైలిలో గోపీచంద్ ఇమేజ్‌ని పెంచే చిత్రంగా రూపొందుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో కృష్ణవంశీది అందెవేసిన చేయి. మొగుడు హోదా అనేది మూడు ముళ్ళు వేసేస్తేనో, ఏడడుగులు నడిచేస్తేనో వచ్చేయదు. భార్య మనసులో చోటు సంపాదించుకున్న మగాడే ఇక్కడ మొగుడు అనిపించుకుంటాడు. ఈ నేపథ్యంలో వినోదాత్మకంగా, భావోద్వేగ ప్రధానంగా ఈ చిత్రం తయారవుతోంది. ఆగస్టు 26 వరకు మారిషస్‌లో భారీ షెడ్యూల్ చేశాం. అక్కడ రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో క్లైమాక్స్ తెరకెక్కిస్తున్నాం. గోపీచంద్, డా.రాజేంద్రప్రసాద్, నరేష్, రోజా, ఫైటర్స్‌పై విజయ్ ఆధ్వర్యంలో ఈ క్లైమాక్స్ తీస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో రెండు పాటలు మినహా సినిమా పూర్తవుతుంది. అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: బాబూశంకర్, ఛాయాగ్రహణం: శ్రీకాంత్, సమర్పణ: భవ్య.


Click it and Unblock the Notifications











