Taraka Ratna Health: కోమాలోనే తారకరత్న.. విదేశీ వైద్యులతో చికిత్స.. మరో రెండు రోజుల్లో!
ప్రస్తుతం నందమూరి తారకరత్న ఆరోగ్య విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ అప్పడప్పుడు అప్డేట్స్ ఇస్తున్న నందమూరి బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ శుక్రవారం యాక్సిడెంట్ గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన స్వల్ప గాయాలతో బయటపడగా.. తారకరత్న ఆరోగ్యం ఇంకా పూర్తిగా నయం కాలేదనే తెలుస్తోంది. తారకరత్నకు సుమారుగా రెండు వారాలుగా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు వైద్యులు. అయితే ఆయన శరీరం ట్రీట్ మెంట్ కు సహకరిస్తుందని తెలిపిన వైద్యులు స్పెషల్ ట్రీట్ మెంట్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

హీరోగా వర్కౌట్ కాలేకపోయినా..
ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందమూరి హీరో తారకరత్న మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోగా పెద్దగా వర్కౌట్ కాకపోయినా విలన్ గా మాత్రం అలరించాడు తారకరత్న. అమరావతి సినిమాలో ఆయన విలనిజానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.

తనకంటూ ప్రత్యేక స్థానం..
సినిమాలకు చాలా కాలం దూరంగా తారకరత్న గతేడాది 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ వెబ్ సిరీస్ పర్వాలేదనిపించుకుంది. అయితే తారకరత్నకు మాత్రం అంత పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకునే క్రమంలో అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యారు తారకరత్న.

మెరుగైన వైద్యం..
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అస్వస్థకు గురైన ఆయన కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన పార్టీ కార్యకర్తలు ఆయనను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత తారకరత్నకు వచ్చింది గుండెపోటు అని వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదాయలయ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే.

విదేశీ వైద్యులతో చికిత్స..
తాజాగా తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి తాజా అప్డేట్ అందింది. తారకరత్నకు మరింత మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్తారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విదేశీ వైద్యులనే నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక హెల్త్ మినిస్టర్ చొరవతో ఆయనకు విదేశీ వైద్యులు వైద్యం అందిస్తున్నారట. తారకరత్నకు గుండె సహా మెదడుకు సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ ను వైద్యులు అందిస్తున్నారని సమాచారం. నిరంతరం వారి పర్యవేక్షణలోనే తారకరత్నకు చికిత్స జరుగుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం తారకరత్న కోమాలోనే ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని వైద్యులు ఆశిస్తున్నారు.

న్యూరో ట్రీట్మెంట్ ఇస్తూ..
కోమాలో ఉన్న తారకరత్నను స్పృహలోకి తీసుకు రావటానికి వైద్యులు న్యూరో ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం. మరో రెండు రోజుల్లో అంటే మంగళవారం లేదా బుధవారం నారాయణ హృదయాలయ వైద్యులు మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హెల్త్ బులిటెన్ తర్వాత మరింత క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఇక నందమూరి కుటుంబ సభ్యులు నిత్యం తారకరత్న ఆరోగ్యం గురించి దగ్గరుండి ఆరా తీస్తున్నారు. బాలకృష్ణ బెంగళూరులోనే ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











