రాముడి పాత్రలో... మూడో ఎన్టీఆర్
'నందీశ్వరుడు' చిత్రం నుంచి హీరో తారక రత్న తన పేరును ఎన్టీఆర్ (నందమూరి తారక రత్న) అంటూ షార్ట్ కట్‌గా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇకపై తనను అలాగే సంబోధించండి అంటూ మీడియాకు విన్నవించుకున్నాడు కూడా. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్, జూనియర్ ఎన్టీఆర్‌లు ఉండటంతో...ఇతన్ని మూడో ఎన్టీఆర్ అంటూ కొందరు ముద్దుగా పిలుచుకుంటున్నారు.
అసలు మ్యాటర్లోకి వస్తే...తారకరత్న, అర్చన, శ్రద్ధాదాస్, కృష్ణుడు ప్రధాన తారాగణంగా వీరు.కె దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆర్.ఎ. ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత జాని నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత జాని మాట్లాడుతూ, ఈ నెల 15న లేదా 16న జరుగబోయే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి పలువురు చిత్ర ప్రముఖులు విచ్చేస్తారని చెప్పారు.
లవకుశలో ఎన్.టి.రామారావు, బాల రామాయణంలో జూ ఎన్టీఆర్, శ్రీరామ రాజ్యంలో బాలకృష్ణ రాముడి పాత్రను పోషించి, ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయారని, వారి కోవలోనే తారకరత్న ఈ చిత్రంలో రాముడిగా కనిపించనుండటం ఓ విశేషం అన్నారు. కలియుగ సీతగా అర్చన, రావణాసురుడిగా కృష్ణుడు కనిపిస్తాడని, అదే పాత్రను ఈచిత్రంలో కొనసాగిస్తూ...సూపర్ స్టార్ కృష్ణ పాటలకు డాన్స్ చేసి అలరిస్తారని చెప్పారు.
దర్శకుడు వీరు.కె మాట్లాడుతూ... బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, కృష్ణ భగవాన్, కొండవలసలతో పాటు కామెడీ విలన్ గా షాయాజీ షిండే, ఫ్యాక్షనిస్ట్ లీడర్‌గా సుమన్ చక్కటి పాత్రలను పోషిస్తున్నారని చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి, రాజోలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 50 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటుందని, జూన్‌లో విదేశాలలో ఓ ఫైట్, ఓ పాటను చిత్రీకరిస్తామని ఆయన తెలిపారు. కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో అత్యంత భారీగా నిర్మాణం జరుపుకునే ఈ చిత్రంలో సి.బి.ఐ ఆఫీసర్ పాత్రలో ఓ ప్రముఖ హీరో నటించనున్నారని, ఆ వివరాలను త్వరలో తెలియజేస్తామని, ప్రస్తుతం సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని వివరించారు.


Click it and Unblock the Notifications











