కళ్లు చెదిరేలా...చెర్రీ-ఉపాసన వెడ్డింగ్ డ్రెస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన కామినేని వివాహం ఈ నెల 14న అంగరంగ వైభవంగా జరుగబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ వివాహ మహోత్సవానికి ప్లాన్ చేశారు మెగా కుటుంబ సభ్యులు. మరి ఆరేంజిలో జరిగే వేడుకలో చెర్రీ-ఉపాసన డ్రెస్ ఏ రేంజిలో ఉండాలో ఒక్కసారి ఊహించుకోండి.
అభిమానుల ఊహలకు తగిన విధంగా....కళ్లు చెదిరేలా చరణ్-ఉపాసన డ్రెస్ డిజైనింగ్ జరుగుతోంది. ఈ బాధ్యతలు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యానికి అప్పగించారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో ఉపాసన మాట్లాడుతూ....తరుణ్ తహిల్యాని మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఫ్రెండ్. అతని డిజైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఎంగేజ్‌మెంట్‌కు కూడా ఆయన డ్రెస్ డిజైన్ చేశారు. పెళ్లికి కూడా మా డ్రెస్ డిజైనింగ్ ఆయనే చేస్తున్నారు' అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.
అంతే కాదండోయ్...తమ బంధాన్ని మగధీర సినిమాతో లింకుపెట్టి మాట్లాడుతోంది ఉపాసన. చెర్రీ మీకెన్నాళ్లుగా తెలుసు? అని అడిగితే మాది జన్మజన్మల బంధం, చరణ్ నాకు ఎప్పటి నుంచో తెలిసినట్లు అనిపిస్తోంది. మా ఇద్దరి ప్రేమ మగధీర సినిమాలోలా 400 ఏళ్ల నాటి బంధం అని సన్నిహితులు అంటుంటారని చెబుతోంది.
పెళ్లి, రిసెప్షన్, సంగీత్ ఈ వేడుక కోసం సినిమాలో మాదిరి భారీ సెట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బాధ్యతను టాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి అప్పగించారు.
చరణ్-ఉపాసన పెళ్లి వేడుకకు ఢిల్లీ స్థాయిలో వీవీఐపీలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అభిమానులను పెళ్లి వేడుకకు దూరంగా ఉంచుతున్నారు. అయితే అభిమానుల కోసం జూన్ 15న తేదీన ప్రత్యేకమైన ఏర్పట్లు చేశారు.
'భద్రతా కారణాల దృష్ట్యా మీ కోసం ప్రత్యేకించి 2012 జూన్ 15వ తేదీన వివాహ రిసెప్షన్ నిర్వహిస్తున్నాము. మీకు, నాన్నగారితో ఉన్న అనుబంధం నాకు తెలుసు. ఆయన కుమారుడినైన నన్ను కూడా మీ ఆదరాభిమానాలతో ఇంతటి వాణ్ణి చేశారు. అందుకే మీరంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. జూన్ 15వ తేదీన ఉదయం 11:15 నుంచి హిమాయత్ సాగర్‌లోని టెంపుల్ ట్రీస్ నందు కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరిగే వివాహ రిసెప్షన్‌కు మీరు విచ్చేసి మీ శుభాకాంక్షలు అందజేస్తేనే ఈ శుభకార్యం సంపూర్ణం అవుతుంది' అంటూ చరణ్ తన అభిమానులకు పంపిన ఇన్విటేషన్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











