వర్మను ముంబై తరిమి కొడ్తాం: టిడిపి నేత రాజేంద్ర ప్రసాద్
తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును, హత్యకు గురైన శాసనసభ్యుడు పరిటాల రవిని రక్త చరిత్రలో వ్యతిరేకంగా చిత్రించిన రామ్ గోపాల్ వర్మను తిప్పి కొడ్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. వర్మను ముంబై తరిమి కొడ్తామని ఆయన చెప్పారు. ఓ ప్రైవేట్ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ ను విలన్ గా చూపించడానికి వర్మకు ఎక్కడి నుంచి దమ్ములు వచ్చాయని ఆయన అన్నారు. సినిమాలో నిజమే ఉందని దమ్ముంటే వర్మ ప్రజల్లోకి వచ్చి చెప్పాలని ఆయన సవాల్ చేశారు. శివసేన అధినేత బాల్ థాకరేను హీరోగా చిత్రించి ఎన్టీఆర్ ను విలన్ గా చూపిస్తారా అని ఆయన అడిగారు.
రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాను తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ కూడా వ్యతిరేకించారు. తాను సినిమా చూడడానికి నిరాకరించినట్లు ఆయన తెలిపారు. ఎన్టీ రామారావు వ్యక్తి కాదు, శక్తి అని ఆయన అన్నారు. ముంబైలో అప్పులు పాలై ఇక్కడికి వచ్చారని ఆయన అన్నారు. బూతు సినిమాలు, సెక్స్ సినిమాలు, హింసాత్మక సినిమాలు తీశారని ఆయన అన్నారు. వర్మ పర్వర్ట్ అని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మిపార్వతి రామ్ గోపాల్ వర్మపై నిప్పులు చెరిగారు. వర్మను నీచుడిగా అభివర్ణించారు. రక్తచరిత్ర సినిమాపై కోర్టుకెక్కుతామని ఆమె హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











