ఆ విషయంలో నేను అజ్ఞానిని.. ఆ సినిమా రెండేళ్లు ఆడింది.. తీన్మార్ మల్లన్న
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి, జేడీ చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ఇద్దరు. ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీఎస్ రెడ్డి సమర్పణలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. ఎస్‌ఎస్ సమీర్ దర్శకుడు. జూలై 7న విడుదల కానున్నది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్మన్న మాట్లాడుతూ..
గబ్బర్ సినిమా యూనిట్ వాళ్లు ఫోన్ చేస్తే కలిసి.. ఏంటి హీరో అన్నాను. దాంతో మమ్మల్ని హీరో అంటావా? అంటే.. విలన్ ఉంటేనే హీరోలకు గుర్తింపని చెప్పాను. హీరోను గట్టిగా చూపించాలంటే విలన్ కూడా అంతే రేంజ్‌లో చూపించాలి. నాకు సినిమాల గురించి తక్కువ అవగాహన ఉంది. నేను ఇప్పటి వరకు 9 సినిమాలు చూసి ఉంటాను. అందులో యాక్షన్ అర్జున్ సినిమా ఒకటి చూశాను అని తీన్మార్ మల్లన్న అన్నారు.
నాకు సినిమాలు చూసేంత సమయం లేదు. ఇటీవల రాంగోపాల్ వర్మ కోరితే కొండా సినిమా చూశాను. సినిమాల విషయంలో నా అంత అజ్ఞాని మరొకడు ఉండడు. కానీ ఈ లోటు కూడా ఉండదనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇద్దరు సినిమా గొప్పగా సక్సెస్ కావాలని కోరుకొంటున్నాను అని తీన్మార్ మల్లన్న తెలిపారు.
సినిమా రంగంలో ఏ సినిమానైనా గొప్పగా సక్సెస్ కావాలంటే.. దాని వెనుక ఉండే కష్టాలు, సుఖాలు బేరిజు వేసుకోవాలి. ఇటీవల కాలంలో రెండేళ్లు ఆడిన సినిమాను చూశాను. అదే కరోనా వైరస్. కరోనా వైరస్ మనల్ని రెండు సంవత్సరాలు ఎంత బాధపెట్టిందో మీకు తెలుసు. ఆ సినిమా ఆడినంత సేపు మనం ప్రేక్షకులమే. ఆ సినిమాను చూడని వారంటూ లేరు. ఆ సినిమాను ఊహాన్ ల్యాబ్స్ సమర్పించింది అని తీన్మార్ మల్లన్న సెటైర్ వేశారు.

సినిమా రంగానికి సంబంధించిన వారి కష్టాలు మా వద్దకు కూడా వస్తాయి. వాస్తవానికి సినిమా రంగం వినోదరంగం. దీని తర్వాతే న్యూస్, మిగితావి. ఇప్పుడు ఇన్ఫోటైన్‌మెంట్‌గా మారాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. మేము తీన్మార్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చాలా పరిశోధన చేశాం. ప్రజలను మెప్పించడానికి మా ఎపిసోడ్స్‌లో నేను చాలా నటించాను అని తీన్మార్ మల్లన్న తెలిపారు.
కమెడియన్ వేణుమాధవ్ నాకు మంచి మిత్రుడు. కొన్నిసార్లు రమ్మంటే.. వెళ్లి షూటింగ్ చూశాను. ఓ సినిమాలో త్రిషతో కలిసి నటించాను. కానీ నాకు సినిమాల్లో నటించడం కష్టమని తెలిసింది. అందుకే న్యూస్‌కు వెళ్లిపోయాను. సినిమా రంగానికి ఏదైనా సాయం కావాల్సి వస్తే.. నేను రెడీగా ఉంటాను అని తీన్మార్ మల్లన్న చెప్పారు.


Click it and Unblock the Notifications











