'తేజ్ ఐ లవ్ యూ' ఫైనల్ కలెక్షన్స్.. బయ్యర్లకు ఎంత నష్టమో తెలుసా!
కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన 'తేజ్ ఐ లవ్ యూ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. సాయిధరమ్ తేజ్ వరుస పరాజయాల్లో మరో చిత్రంగా నిలిచిపోయింది. మెగాస్టార్ చిరంజీవితో ఛాలెంజ్, అభిలాష వంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన కె ఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ తొలిసారి ఈ చిత్రంలో తేజు సరసన హీరోయిన్ గా నటించింది. విడుదల ముందు వరకు ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. కరుణాకరన్ మ్యాజిక్ చేయలేకపోయాడు.

కొత్తదనం లేక
కరుణాకరన్ ప్రేమకథల స్పెషలిస్ట్ అనడంలో సందేహం లేదు. కానీ తేజ్ ఐ లవ్ యు చిత్రం చూస్తే గతంలోని కరుణాకరన్ చిత్రాల లాగే అనిపిస్తుంది. వినోదం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తేజ్ ఐ లవ్ యు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

భారీ వ్యత్యాసం
ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు 16 కోట్ల వరకు జరిగింది. కానీ తేజ్ ఐ లవ్ యు చిత్రం మాత్రం కేవలం 4.22 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. ప్రీరిలీజ్ బిజినెస్, తుది రన్ లో చిత్రం సాధించిన వసూళ్ల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. దీనితో అన్ని ఏరియాలలో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో
తేజ్ ఐ లవ్ యు చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.70 కోట్లు మాత్రమే సాధించింది. ఓవర్సీస్ లో ఈ చిత్ర పరిస్థితి మరీ దారుణం. ఓవర్సీస్ లో 20 లక్షలు మాత్రమే రాబట్టింది. ఏ ఏరియాలో కూడా కోటికి మించి వసూళ్లు అధికమించలేకపోయింది.

ఇంకా క్లారిటీ లేదు
వరుస పరాజయాలతో సతమతమవుతున్న తేజుకు అర్జంటుగా ఓ హిట్టు కావాలి. తేజు ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి తేజు తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడట.


Click it and Unblock the Notifications











