అలాంటి వారే స్టార్స్ అవుతారు.. నా దృష్టిలో అమితాబ్, చిరంజీవి.. తేజ కామెంట్స్
ఒక్కో డైరెక్టర్‌లో ఒక్కో విలక్షణత ఉంటుంది. ఆలోచనలు, పనుల్లో ఎవరికి వారు ప్రత్యేకం. తెలుగు దర్శకుల్లో కెల్లా అలాంటి విలక్షణత ఉన్న డైరెక్టర్ ఎవరంటే అది తేజనే అని చెప్పుకోవచ్చు. ముక్కుసూటిగా మాట్లాడటం తేజలో ఉన్న అడిషనల్ అట్రాక్షన్. అదే స్టైల్ చూపుతూ తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు తేజ. ఈ సారి వారసత్వ హీరోల గురించి ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని చెప్పేశాడు.
ఓ వ్యక్తి స్టార్ హీరో కావడం అంత ఆషామాషీ విషయం కాదని పేర్కొన్న తేజ.. కేవలం నటనపై దృష్టి పెట్టి అహర్నిశలు కృషి చేసిన వారే స్టార్స్ అవుతారని చెప్పాడు. వారసత్వంగా ఎవరూ స్టార్స్ కాలేరని, ఒకవేళ అయినా నటనపై దృష్టి పెట్టకుంటే ఎక్కువకాలం నిలబడలేరని అన్నాడు. సెట్‌లో షాట్ పూర్తయిన తరువాత సెట్లోనే ఉంటూ ఇతర నటీనటుల నటనను పరిశీలించిన వారే స్టార్స్ అవుతారని అంటున్నాడు తేజ. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ఆమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు అలాగే ఈ స్టేటస్ పొందారని తేజ చెప్పుకొచ్చాడు.

తన సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా ఏ మాత్రం పట్టించుకోకుండా లైట్ తీసుకొని నెక్స్ట్ ప్రాజెక్టు మొదలెట్టేయడం తేజ నైజం. పైగా పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడడు డైరెక్టర్ తేజ. కొత్త నటీనటులను ఎంకరేజ్ చేయడం తేజ స్టైల్. అలాంటి తేజ ఇప్పుడు స్టార్ స్టేటస్ గురించి మాట్లాడటం సినీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.
ఇటీవలే 'సీత' సినిమాతో డిసప్పాయింట్ అయ్యాడు తేజ. కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. తన తదుపరి సినిమా కోసం ఓ విభిన్న కథాంశాన్ని రెడీ చేస్తున్నానని ప్రకటించాడు తేజ. ప్రస్తుతం ఈ కథకు సంబందించిన స్క్రిప్ట్ పనుల్లోనే నిమగ్నమై ఉన్నానని అన్నాడు. అయితే ఇది మల్టీస్టారర్ సినిమా అని తేజ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.


Click it and Unblock the Notifications











