దిల్‌రాజు ప్రకటన: తెలంగాణ బిల్లుతో ‘ఎవడు’ ఆలస్యం
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం డిసెంబర్ 19న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇటీవల దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఆయన తాజాగా ప్రకటించారు. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే సినిమా మరోసారి వాయిదా వేస్తామని తెలిపారు.
ఈ విషయమై ఆయన మీడియా సంస్థతో మాట్లాడుతూ...'ఎవడు చిత్రాన్ని డిసెంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. అయితే డిసెంబర్ 19 లోపు తెలంగాణ బిల్లు రాక పోతే విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే సినిమా విడుదల మరోసారి వాయిదే వేసే అవకాశాలు ఉన్నాయి' అని తెలిపారు.
'ఎవడు' సినిమా వాయిదా పడటం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే వాదనను ఇన్నాళ్లు తోసిపుచ్చుకుంటూ వచ్చిన దిల్ రాజు...ఎట్టకేలకు ఆ విషయాన్ని తన నోటితో ఒప్పుకోవడం గమనార్హం. ఆ మధ్య సినిమాను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధం అవ్వగా....కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విభజన ప్రకటన చేస్తుందనే సంకేతాలు చిరంజీవి ద్వారా తెలుసుకున్న దిల్ రాజు ముందు జాగ్రత్తగా సినిమా విడుదల నిలిపి వేసారు. అపుడు సినిమాను నిలిపి వేయడమే మంచిదైంది. లేకుంటే ఆందోళనల కారణంగా సినిమాకు తీవ్ర నష్టం ఏర్పడేది.
ఆ తర్వాత సినిమా విడుదల చేద్దామనే ప్లాన్ చేసినప్పటికీ ఇతర సినిమా విడుదల, థియేటర్ల సమస్య కారణంగా సినిమా విడుదల కాలేదు. పరిస్థితి కాస్త చక్కబడటంతో డిసెంబర్లో సినిమాను విడుదలకు ప్లాన్ చేసుకున్నారు దిల్ రాజు. అయితే అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాన్ని పూర్తి చేస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తుండటంతో దిల్ రాజు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












