రామాయణం సీరియల్ సూపర్ హిట్.. శ్రీమద్ భాగవతం బ్లాక్‌బస్టర్ కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి
సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే విధంగా ప్రముఖ నిర్మాణ సంస్థ సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం శ్రీమద్ భాగవతం పార్ట్-1. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం పార్ట్-1 చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి, ప్రముఖ నిర్మాత మోతీ సాగర్, రామోజీ గ్రూప్ ఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ శ్రీమతి విజయేశ్వరి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

దేశంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ ఒక యూనిక్ ఫిల్మ్ సిటీ.. అలాంటి రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉండటం మనకు గర్వకారణం. శ్రీ మద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు సినిమా టీమ్‌ను అభినందిస్తున్నా. తరం మారుతున్న ఈ సమయంలో 'శ్రీమద్ భాగవతం' లాంటి సినిమాలు చాలా అవసరం. నలభై ఏళ్ల క్రితం రామాయణం సీరియల్ రామాయణాన్ని అందరికీ చేరువ చేసింది. కరోనా సమయంలో మళ్లీ రామాయణం సీరియల్‌ను టెలికాస్ట్ చేస్తే రికార్డు సృష్టించింది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
2035 సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమిగా తీర్చి దిద్దాలని మేం సంకల్పించాం. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నాం.. 2047 విజన్ డాక్యుమెంట్ లో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. ఆనాడు రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ ఎంత పాపులర్ అయిందో.. శ్రీమద్ భాగవతం పార్ట్-1 సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నా మూవీ టీమ్ కు నా అభినందనలు. రాబోయే రోజుల్లో హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ చేసే స్థాయికి ఎదగాలని మా ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం తెలంగాణలో సినిమా పరిశ్రమకు కొత్త ఊపిరి పోసే అవకాశం ఉందని, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి అత్యాధునిక సౌకర్యాలు దీనికి దోహదపడతాయని సినీ పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. "శ్రీమద్ భాగవతం పార్ట్-1" చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ ప్రపంచ స్థాయి ప్రతిభావంతులు కూడా ఉన్నారు,
లైఫ్ ఆఫ్ పై, హ్యారీ పాటర్ సిరీస్, ది జంగిల్ బుక్, మార్వెల్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ మరెన్నో అంతర్జాతీయ చిత్రాలు, సిరీస్‌లకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా బాధ్యతలు నిర్వహించిన క్లైడ్ ఎడ్వర్డ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 20 సంవత్సరాలకు పైగా అనుభవం, మిషన్: ఇంపాజిబుల్, స్టార్ ట్రెక్, ఫాస్ట్ & ఫ్యూరియస్ 7 హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ జోయెల్ షాఫెర్ ఈ సినిమాకు పనిచేయడం విశేషంగా మారింది. శ్రీమద్ భాగవతం మొదటి భాగం 2026లో బహుళ భాషలలో గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. 1987 ప్రసారమైన రామాయణం సీరియల్‌కు పనిచేసిన యూనిట్ 4 ఏళ్లకుపైగా పరిశోధన చేసి కథ రూపొందించారు. ఈ చిత్రాన్ని ఐమాక్స్ వెర్షన్‌లో రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











