తెలంగాణ ఎన్నికల వేళ.... ఆ ట్రైలర్ చూసి అంతా షాక్, పచ్చ జెండాలు, బెజవాడ విలన్!
తెలంగాణ కోసం ఉయ్యాలో... విజయ్ దేవ్ పుట్టే వియ్యాలో... రాష్ట్రం ఇవ్వకపోతే ఉయ్యాలో... ప్రాణమిస్తానండు ఉయ్యాలో.. కన్నెర్ర చేసిండు ఉయ్యాలో.. కేంద్రమే చూసింది ఉయ్యాలో.. దీక్షలో కూర్చుండు ఉయ్యాలో.. దేశమే కదిలింది ఉయ్యాలో.... అంటూ బుతకమ్మ పాటతో 'తెలంగాణ దేవుడు' సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఓ వైపు తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల హడావుడి ప్రారంభమైన నేపథ్యంలో 'తెలంగాణ దేవుడు' ట్రైలర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆరు నిమిషాలకుపైగా నిడివిగల ఈ ట్రైలర్ చూస్తుంటే కేసీఆర్ జీవితానికి సంబంధించిన ట్రైలర్ చూసినట్లు ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితాన్ని బేస్ చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. మాక్ ల్యాబ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై.. మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించగా, హరీష్ వడ్‌త్యా దర్శకత్వం వహించారు.

కేసీఆర్ బాడీ లాంగ్వేజ్ డిట్టో దించేశాడు
ఈ చిత్రంలో కేసీఆర్ గురువు ప్రొఫెసర్ జయశంకర్ పాత్రను ప్రముఖ నటుడు సుమన్ పోషించినట్లు తెలుస్తోంది. మన తెలంగాణ అభివృద్ధి కావాలంటే మనలో ఒకడు ఉద్యమ వీరుడు కావాలంటూ శ్రీకాంత్ చెప్పే డైలాల్స్, బాడీ లాంగ్వేజ్ అచ్చం కేసీఆర్‌ను ప్రజంట్ చేసినట్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జయశంకర్ గుర్తొస్తున్నారు
ఇక్కడున్న రాజకీయ నాయకులు ప్రాంతీయ విబేధాలతో వాళ్ల ప్రాంతం నుంచి భూస్వాములను తీసుకొచ్చి ఇక్కడున్న మన రైతుల సాగుభూములను దోచుకున్నారు... అంటూ సుమన్ చెప్పే డైలాగులు కేసీఆర్ గురువు జయశంకర్‌ను గుర్తు చేస్తోంది.

బంగారు తెలంగాణ పార్టీ
తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చడానికి, మన తెలంగాణ ప్రాంతం గురించి భువన వీధిలో ఉంచనీకి బంగారు తెలంగాణ పార్టీ పెడుతున్నాను సార్... అంటూ విజయ్ దేవ్(శ్రీకాంత్) తన గురువుతో చెప్పే డైలాగ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దీని ద్వారా సినిమాలో కేసీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ప్రజంట్ చేసినట్లు స్పష్టమవుతోంది.

పచ్చ జెండాలు చూసి అంతా ఆశ్చర్యం
అమర వీరుల స్థూపం వద్ద హీరో పాత్రధారి తన పార్టీ నాయకులతో కలిసి నివాళులు అర్పించే పాటలో.... పసుపు పచ్చ రంగు జెండాలు కనిపించడం గమనార్హం.

బెజవాడ భుజంగం
ఈ చిత్రంలో బెజవాడ భుజంగం అనే విలన్ పాత్రలో తనికెళ్ల భరణి నటిస్తున్నట్లు తెలుస్తోంది. నటి సంగీత శ్రీకాంత్ భార్య పాత్రలో నటించింది.
తెలంగాణ ఆయన వల్లే వచ్చింది అనే భావన బలంగా
ఈ ట్రైలర్ చూసిన వారంతా మరోసారి కేసీఆర్ దీక్ష, తెలంగాణ ఉద్యమ పోరాటం గుర్తు చేసుకుంటున్నారని, కేసీఆర్ వల్లే తెలంగాణ సాధన సాధ్యమైంది అనే విషయాన్ని ‘తెలంగాణ దేవుడు' సినిమా ద్వారా మరోసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది అంటున్నారు.


Click it and Unblock the Notifications











