Sankranti 2023: బాలకృష్ణ-చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్.. ఆరోజు అందరికి పూనకాలు లోడింగ్!
తెలుగు సినిమాలకు గానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు గానీ సంక్రాంతి పండుగ సీజన్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. బడా హీరోలు, నిర్మాతలు ఈ పండుగపైనే ఫోకస్ పెడుతూ తమ చిత్రాలను విడుదల చేయాలనుకుంటే.. ఈ ఫెస్టివల్ కు ఎన్ని సినిమాలు వస్తాయి.. ఎన్ని షోలతో వస్తాయి అని ఎదురు చూస్తుంటారు సినీ ప్రియులతోపాటు హీరోల అభిమానులు. ఇక ఈ పండుగకు టాలీవుడ్ నుంచి ఇద్దరు బడా స్టార్లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీర సింహా రెడ్డిగా నందమూరి నటసింహం బాలయ్య బాబు గర్జించడానికి సిద్ధంగా ఉంటే.. వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టనున్నాడు. ఇప్పుటు తెలంగాణ ప్రభుత్వం ఈ ఇద్దరు హీరోల అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది.

జనవరి 12న వీర సింహా రెడ్డి...
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా గర్జించబోతున్న చిత్రం వీర సింహా రెడ్డి. టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. అనంతపురం బ్యాక్ డ్రాప్ లోనే దర్శకుడు కొన్ని నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దినట్లు చెప్పాడు. బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

జనవరి 13కు వాల్తేరు వీరయ్య..
వరుస పెట్టి సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చిరంజీవి తొలిసారిగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ అలరించనున్నాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా ఈ రెండు సినిమాల్లో ప్రధాన హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇక ఈ చిత్రం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

6 షోలకు అనుమతి..
ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి అభిమానులకు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. జనవరి 12న రీలీజ్ కానున్న వీర సింహా రెడ్డి, ఆ తర్వాతి రోజు అంటే జనవరి 13న వస్తున్న వాల్తేరు వీరయ్య రెండు సినిమాలకు ఆరో ఆటకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కారు. ఈ రెండు సినిమాలకు ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా విడుదల రోజు ఉదయం 4 గంటలకు షో ప్రదర్శించే వెసులుబాటు కల్పించింది. అంటే ఈ రెండు చిత్రాల రిలీజ్ రోజున ఉదయం నాలుగు గంటలకే షో వేసుకోవచ్చని పేర్కొంది. దీంతో ఇటు నందమూరి అభిమానులు, అటు మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అంటే ఈ సంక్రాంతికి నందమూరి, మెగా ఫ్యాన్స్ తో పూనకాలు లోడింగ్ అన్నమాట.


Click it and Unblock the Notifications











