మొగిలయ్యకు తెలంగాణ సర్కార్ భారీ నజరానా.. కోటి నగదుతో పాటు ఇంటి స్థలం కూడా!
కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్యకు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెర వాయిస్తున్న ఏకైక కళాకారుడైన మొగిలయ్య గ్రామాల్లో అక్కడా ఇక్కడా కిన్నెర వాయించుకుంటూ పొట్ట నింపుకునే వాడు. అయితే ఆయన గురించి తెలిసి త్రివిక్రమ్ ఆయనతో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడించడంతో ఆ ఒక్క పాటతో ఆయన ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ఆయన 'భీమ్లా నాయక్' సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కళారంగంలో చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో మొగిలయ్యను సత్కరించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆయనకు గతంలో కోటి రూపాయల నగదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే 300 గజాల స్థలం కూడా నజరానాగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు కోటి నగదు ఇవ్వాలని తాజాగా కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనకు బీఎన్ రెడ్డి నగర్‌లో మొగిలయ్యకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు చెందిన కిన్నెర మొగిలయ్య స్వగ్రామం నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల అనే గ్రామం. 1951లో జన్మించిన ఆయన పూర్తి పేరు దర్శనం మొగిలయ్య. ఆయన పూర్వికులు కూడా కిన్నెర మెట్ల కళాకారులే.. గతంలో 9 మెట్లకు పరిమితమైన కిన్నెరను.. ఆయన 12 మెట్లకు పెంచారు. ఇక గతంలో కూడా ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శనలు ఇచ్చారు. అంతేకాదు మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చి ఆయనను గౌరవించింది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్న మొగిలయ్యకు తాజాగా పద్మశ్రీ పురస్కారం దక్కింది. 12 మెట్ల కిన్నెర వాయిస్తూ ఎక్కువగా పండుగల సాయన్న, పానుగంటి మీరా సాహెబ్, ఎండబెట్ల ఫకీరయ్య గౌడ్, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, వనపర్తి రాజుల కథలు వంటి తెలంగాణ వారి వీరగాథలు తన వాద్యంతో వినిపించే మొగులయ్యకు పవర్ స్టార్ పవర్ కల్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక కొద్ది రోజుల క్రితం బీజేపీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మెట్ల మొగులయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. తన కళను గుర్తించి తనకు జీవితాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులను అవమానపరిచేలా బీజేపీ నాయకులు వ్యవహరించడం బాధాకరమని అంటూ ఒక వీడియో కూడా విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











