నీపై కేసు పెడతానని మహేష్ బాబుకు చెప్పా: గవర్నర్ నరసింహన్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై తెలంగాణ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పదవీ కాలం ముగిసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో ఆయన చివరి సారిగా గవర్నర్ హోదాలో మీడియాతో సమావేశమై ఇష్టాగోష్టిగా చర్చించారు. తొమ్మిదిన్నరేళ్ల గవర్నర్ పదవి తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇకపై చెన్నైలో కామన్ మ్యాన్‌లా జీవిస్తానని తెలిపారు.
అయితే ఈ సందర్భంగా నరసింహన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తావన తేవడం గమనార్హం. తాను ఒకసారి మహేష్ బాబును కలిసినపుడు కేసు పెడతానని చెప్పినట్లు వెల్లడించారు. ఆయన ఎందుకు అలా అన్నారు? ఆ సందర్భం ఏమిటో ఓ లుక్కేద్దాం.

ఆ ప్రశ్నతో మహేష్ బాబు ప్రస్తావన
మీరు గవర్నర్‌గా కొనసాగిన కాలంలో తీసుకున్న కఠిన నిర్ణయం ఏమిటి? అనే ప్రశ్నకు నరసింహన్ మాట్లాడుతూ... నేను ఎప్పుడూ టఫ్ డెసిషన్లు తీసుకోలేదు. నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంటుంది, గవర్నర్ తీసుకోరు. మీడియా నేను టఫ్ మ్యాన్ అని భావించి ఉండొచ్చు అని వెల్లడిస్తూ ఈ క్రమంలో మహేష్ బాబు ప్రస్తావన తెచ్చారు నరసింహన్.

తల నాది, బాడీ మహేష్ బాబుది
ఒకరోజు నా గురించి ‘సర్వాధికారి' అని రాస్తూ ఫోటో పెట్టి ఓ పేపర్లో న్యూస్ రాశారు. ఆ ఫోటో చూసి నేనే ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడూ లైఫ్‌లో యూనిఫాం వేసుకోలేదు. యూనిఫాంతో మన ఫోటో ఎలా వచ్చింది? అనుకున్నాను. తల మాత్రం నాది ఉంది, బాడీ మహేష్ బాబుది ఉందని నరసింహన్ గుర్తు చేసుకున్నారు.

మహేష్ బాబుపై కేసు పెడతానని చెప్పా
మరోసారి నేను మహేష్ బాబును ఓ ఫంక్షన్లో కలిసినపుడు మహేష్ నీపై ఫోర్జరీ, చీటింగ్ కేసు పెడతాను అన్నాను(నవ్వుతూ) అంటూ గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆ వార్త చూసి తాను నవ్వుకున్నట్లు గవర్నర్ తెలిపారు.

ఆ ఫోటో నా మనవళ్లు, మనవరాళ్లకు చూపించుకోవచ్చు
నేను ఒక అధికారిని, కానీ సర్వాధికారిని కాదు. అయితే అలా రాయడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే రేపు నా మనవళ్లు, మనవరాళ్లు చూపించి మీ తాతయ్య గురించి మీడియాలో ఎంత గొప్పగా రాశారని చెప్పుకోవడానికి ఉంటుందని గవర్నర్ సరదాగా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











