సైరాపై సంచలన తీర్పు.. ఆపడం సాధ్యం కాదంటూ గ్రీన్ సిగ్నల్
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'సైరా నరసింహా రెడ్డి' విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తమను నమ్మించి మోసం చేశారని, చరిత్రను వక్రీకరించారని పేర్కొంటూ ఉయ్యాలవాడ వంశీయులు నానా హంగామా చేసి చివరకు కోర్టు వరకూ వెళ్లారు. వీరికి తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ మేరకు సైరా విడుదలను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ఉయ్యాలవాడ వంశీయులు వేసిన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సైరా విడుదల ఆపడం సాధ్యం కాదని తేల్చేసింది. సినిమా విడుదల విషయమై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సినిమాను వినోదపరంగా చూడాలని, మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు చూపించడం కొంతవరకు సాధ్యం కాదు అని న్యాయమూర్తి వాఖ్యలు చేసినట్టు తెలిసింది. చివరకు సైరా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

మరోవైపు ఉయ్యాలవాడ వంశీయులు కూడా వెనక్కి తగ్గారు. సినిమా విడుదల సందర్భంగా తాము వేసిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎలాగోలా మొత్తంమీద వివాదం సద్దుమణగటం మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











