ఖాళీ చేయించడం చట్టవిరుద్ధం: హీరో ప్రభాస్ భూవివాదంపై హైకోర్టు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు సంబంధించిన భూ వివాదంలో తెలంగాణ హైకోర్ట్ మంగళవారం కీలకతీర్పు వెలువరిచింది. ప్రభుత్వ అధికారులు ఆ భూమి నుంచి అతడిని ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ప్రభాస్ పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తుపై 8 వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని పైగా భూముల్లో ప్రభాస్‌కు 2,083 చదరపు గజాల భూమి ఉంది. దీన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అధికారులు సీజ్ చేయడంతో బాహుబలి యాక్టర్ కోర్టును ఆశ్రయంచిన సంగతి తెలిసిందే. ప్రభాస్ భూమితో పాటు ఆ ప్రాంతంలో ఉన్న మరికొన్ని ఎకరాలను అధికారులు కొన్ని నెలల క్రితం సీజ్ చేశారు.

చట్టవిరుద్ధమే, కానీ...
చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా గవర్నమెంట్ అఫీషియల్స్ భూములను స్వాధీనం చేసుకున్నపుడు వాటిని తిరిగి వారికి అప్పగించాలని ఆదేశాలివ్వవచ్చు, గతంలో సుప్రీం కోర్టు కూడా ఇలాంటి తీర్పులు ఇచ్చింది, కానీ ఇక్కడి భూముల(ప్రభాస్‌తో పాటు మరికొందరు) విషయంలో 1958 నుంచి వివాదం ఉన్న నేపథ్యంలో తాము ప్రస్తుతం అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తెలిపింది.

అధికారులు సరిగా స్పందించలేదు
లీగల్ దస్తావేజుల ద్వారా ప్రభాస్ భూమిని కొనుగోలు చేశారు. దీనిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదనే క్రమబద్ధీకరణ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. అయినప్పటికీ అధికారులు దాన్ని పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోర్టు పేర్కొన్నది. ప్రస్తుతానికి ఈ భూముల వ్యవహారంలో ప్రభాస్ హక్కుల జోలికి తాను వెళ్లడం లేదని తెలిపింది.

ప్రభుత్వం అలా చేయడం సరికాదు
ఈ భూములు చాలా సంవత్సరాల నుంచి ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం కాగితాలు చూపి తమ ఆధీనంలో ఉన్నాయని చెప్పడం సరికాదు. ఆక్రమణదారులకు కొన్ని హక్కులు ఉంటాయని, వారిని ఖాళీ చేయించడానికి భూఆక్రమణల నిరోధక చట్టాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది.

అలా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం
ప్రభాస్ క్రమబద్దీకరణ కోసం పెట్టుకున్న దరఖాస్తు పరిష్కరిస్తే ఇలాంటి వివాదంలో ఉన్న మరికొందరు కూడా క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీని వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, వివాదాలు పరిష్కారం అవుతాయని కోర్టు సూచించింది. క్రమబద్దీకరణ విషయంలో అధికారుల నిర్ణయం వ్యతిరేకంగా ఉంటే పై కోర్టును ఆశ్రయించవచ్చని న్యాయస్థానం పేర్కొంది.


Click it and Unblock the Notifications











