కేసీఆర్ నిర్ణయం: రంగు పడుద్దనే ఆందోళనలో టాలీవుడ్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పోలీసు వ్యవస్థలో పలు మార్పులు తేవడానికి ప్రయల్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో న్యూయార్క్ స్థాయి ప్రమాణాలు కలిగిన పోలీసింగ్ వ్యవస్థపై తెరాస ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఖాకీ దుస్తుల స్థానంలో నీలిరంగు డ్రెస్ కోడ్ తేవాలనే ఆలోచనలో ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇటు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కాస్త ఆందోళన వ్యక్తం అవుతోంది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్టాల్లో తెలుగు సినిమాలు చూస్తారు. ఈ నేపథ్యంలో సినిమాల్లో పోలీసులకు సంబంధించిన సన్నివేశాలు వచ్చినపుడు మరి ఖాకీ దుస్తులు వాడాలా? లేక తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమలు లోకే తెచ్చే డ్రెస్ వాడాలా? అనే విషయంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ పోలీసు వ్యవస్థ డ్రెస్ ఒకేలా ఉండాలని సినీ పరిశ్రమకు చెందిన వారు కోరుకుంటున్నారు.

మిశ్రమ స్పందన
మరో వైపు పోలీస్ శాఖ అత్యాధునికత కోసం డ్రెస్ కోడ్‌లో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

ఖాకీ అంటేనే పోలీస్
పోలీస్ అంటే ఖాకీ అనే గుర్తు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. పోలీస్ అంటే ఖాకీనే అన్నట్టుగా పాతుకుపోయింది. అలాంటిది ఇప్పుడు ఒకేసారి డ్రెస్ కోడ్ మారిస్తే ప్రజలు స్వీకరిస్తారా? అని సీనియర్ పోలీస్ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

దేశం మొత్తం ఖాకీ..
దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ శాఖల డ్రెస్ కోడ్‌లు ఒకేలా ఉంటాయి. ఖాకీ రంగు ఉన్న డ్రెస్ కోడ్ అమలు చేయడానికి ప్రత్యేక నేపథ్యం ఉంది. ఖాకీ అంటే మట్టి అని అర్థం. మట్టికి ఎంతో సహనం, ఓపిక ఉంటుంది. ఇదే ఓర్పు, సహనంతో పోలీసులు మెలగాలని ఖాకీ రంగును పోలీస్ డ్రెస్ కోడ్‌కు వర్తింపజేశారు.

ఖాకీ డ్రెస్ కోడ్
1847లోనే ఈ పోలీస్ డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఖాకీ రంగు డ్రెస్ అయితేనే పోలీస్ శాఖకు వన్నె తెస్తుందని పలువురి అభిప్రాయం.

గతంలో మార్చారు కానీ...
హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం గతంలో డ్రెస్ కోడ్‌ను మార్చింది. ఈ డ్రెస్‌ను ప్రజలు స్వీకరించలేదు. దీంతో మళ్లీ ఖాకీ డ్రెస్సు కోడ్ అమలు చేసారు.


Click it and Unblock the Notifications











