ఆంధ్రా నిర్మాతల పెత్తనం: సినీ పరిశ్రమనూ విభజించాల్సిందే!

అయితే కొందరు తెలంగాణ సినీ కళాకారులు, నిర్మాతలు మాత్రం ఉమ్మడిగా ఉండటం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని, వివక్ష చూపిస్తున్నారని, రాష్ట్ర విభజన జరిగిందికాబట్టి.... తెలుగు సినీ పరిశ్రమలోనూ విభజన జరుగాల్సిందే అంటూ మీడియాకెక్కారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ సినిమాను ప్రోత్సహించడానికి, తెలంగాణ సినీ కళాకారులకు చేయూతనివ్వడానికి హైదరాబాద్‌లోని ఏపి ఫిలిం ఛాంబర్ కార్యాలయంలోని ఓ భాగాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి తక్షణం కేటాయించాలని తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
ఇతర రంగాల మాదిరిగానే తెలంగాణ వారికి తెలుగు సినిమా రంగంలో అన్యాయం జరుగుతోందని, తెలంగాణ వారిపై వివక్ష కొనసాగుతోందని అన్నారు. ఫిలింఛాంబర్ పెద్దలు తెలంగాణ సినిమాను ప్రాంతీయ భాషా సినిమాగా వేరు చేసి చూపించారు. ఇలా చేయడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణ వారికి న్యాయం జరుగాలంటే తెలంగాణ సినిమాను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు కల్పించాలి అని కోరారు. సినిమాలను ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించాలని తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్ పేర్కొన్నారు. తెలంగాణ దర్శక, నిర్మాతలు ఐక్యంగా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీ ఫిల్మ్ చాంబర్ ఎదుట ఆందోళన
ఏపీ ఫిలించాంబర్ పేరును తెలుగు ఫిలించాంబర్‌గా మార్చడాన్ని నిరసిస్తూ ఫిలించాబర్ ఎదుట తెలంగాణ నిర్మాతలు ఆందోళనకు దిగారు. ఏపీ ఫిలించాంబర్ కార్యవర్గ సమావేశాన్ని వారు బహిష్కరించారు. చాంబర్ ఎదుట జై తెలంగాణ అంటూ నిరసన తెలియజేశారు. తెలుగు ఫిలించాంబర్ పేరుతో ఆంధ్రా నిర్మాతలు మళ్లీ పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ఫిలించాంబర్‌ను ఏపీ, తెలంగాణ ఫిలించాంబర్లుగా విభజన చేయాలని తెలంగాణ నిర్మాతలు, ఎగ్జిక్యూటర్లు డిమాండ్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై మండి పడ్డ తెలంగాణ సినిమా సంఘం
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వర్మ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత దర్శకులు, నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. వర్మ వ్యాఖ్యలు వ్యంగ్యంగా, అవమాన పరిచే విధంగా ఉన్నాయని, వెంటనే అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.


Click it and Unblock the Notifications











