Dil Raju సీఎం రేవంత్ రెడ్డితో 75 నిమిషాలు దిల్ రాజు టీమ్.. సమావేశంలో ఏం జరిగిందంటే?
సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాల రిలీజ్ విషయం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఆ సమయంలో రిలీజ్ బరిలో ఉన్న ఈగిల్ సినిమాను వాయిదా వేయించడంలో ఫిలిం ఛాంబర్ సఫలమవ్వడమే కాకుండా ఇతర సినిమాల నుంచి పోటీ లేకుండా సింగిల్ రిలీజ్ అయ్యేలా చూస్తామని రవితేజ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 9వ తేదీన ఈగిల్ సినిమా రిలీజ్‌కు పోటీగా వస్తున్న నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..
ఈగిల్ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అయ్యేలా సపోర్ట్ చేస్తున్నాం. ఆ క్రమంలో పాన్ ఇండియా మూవీ లాల్ సలామ్ సినిమా కూడా రిలీజ్ కావడానికి పీపుల్స్ మీడియా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అలాగే అదే తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించిన ఊరుపేరు భైరవకోన నిర్మాత రాజేష్‌తో మాట్లాడి ఆ సినిమా విడుదలను వాయిదా వేయించాం.అందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాం అని అన్నారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ గిల్డ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్స్ జనవరి 28 తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. దాదాపు 1. 15 నిమిషాలు సీఎం గారితో ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు గురించి చర్చించడం జరిగింది అని తెలిపారు.
సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలను వివరించగా సీఎం రేవంత్ రెడ్డి సావధానంగా విన్నారు. సమస్యలే కాదు సమస్యల పరిష్కారాలు కూడా మీరే తీసుకురండి అని సూచించారు. ప్రభుత్వాన్ని నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సర్కారు రెడీగా ఉంటుంది.

సినిమా పరిశ్రమలోని సమస్యల గురించి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అందులో అందరి అభిప్రాయాలు తీసుకొని, సమస్యల పరిష్కారం కోసం అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. సమస్యల పరిష్కారాలను వారికి వివరించి తగు రీతిలో సహాయం కోరుతాం అని చెప్పారు.
సినీ ప్రముఖులు చెప్పిన సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానానికి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేము చెప్పిన కొన్ని విషయాలను విన్న తర్వాత వెంటనే ఆయ అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించాలని సూచించారు. పలువురు అధికారులకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని కమిటీ సభ్యులు తెలిపారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టీ ప్రసన్నకుమార్, వై వీఎస్ చౌదరి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కూచిబొట్ల, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత రాజేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











