సానుభూతి చూపండి..చలన చిత్రమండలి పిలుపు
తెలుగు సినిమా పరిశ్రమకి తెలంగాణ కావాలి, ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు దేశమంతా, ప్రపంచమంతా కావాలి..అంటూ చలనచిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. అలాగే జీవితాలను పణంగా పెట్టి సినిమాలు తీసేవారు ఉన్నారు. సినిమా రంగాన్నే నమ్ముకున్న వేలాది మంది కార్మికులు ఉన్నారు. నిర్మాతలుగా ఎంతో కృషి చేసినప్పటికీ ఆర్థికంగా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇలాంటి సినిమా రంగం మీద సానుభూతి చూపించాల్సిందిగా ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటున్నాం అని ఆయన అన్నారు.
2009లో విడుదలైన తెలుగు చిత్రాల్లో కేవలం 10 నుంచి 15 శాతం సక్సెస్ రేటును సాధించడం జరిగింది. అలాగే పైరసీ తెలుగు సినిమా రంగాన్ని పీల్చి పిప్పి చేసింది. ఈ ఇబ్బందులను అధిగమించి 2010లో ఎక్కువ సక్సెస్‌రేటు సాధించడానికి, పైరసీపై విజయం సాధించడానికి ఎవరివంతు కృషి వారు చేస్తూ ఉండాలని, వారికి అన్ని రంగాల వారూ తోడ్పాటునివ్వాలని కోరుకుంటున్నాం. భారతదేశంలో హిందీ చిత్రాలకు పోటీగా, వారికంటే ఒక్క సినిమా అయినా ఎక్కువగా తీసే పరిస్థితిలో మన తెలుగు సినిమారంగం ఉంది. దీనిని తెలుగువారందరూ గర్వకారణంగా భావిస్తాం. ఇది తెలుగువారందరికీ గర్వకారణమే గానీ, ఏ ఒక్క ప్రాంతానికో, వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో గర్వకారణం కాదు.
ఇక ఎ.ఆర్.రెహమాన్ కు ఆస్కార్ అవార్డు రాగానే మన భారతీయుడికి ఆస్కార్ వచ్చిందని, ఇది భారతీయులందరికీ గర్వకారణమని సంబరాలు చేసుకున్నాం. అతనిని ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంగీత దిగ్గజంగానే మనం చూశాం. అలాగే తెలుగు వారందరం తెలుగు సినిమా పరిశ్రమను కాపాడుకుందాం' అన్నారు. సంక్రాంతి విడుదలలకు సినిమాలు రిలీజ్ అవుతున్న స్ధితిలో ఈ ప్రకటన చేయటం అందరినీ ఆలోచింపచేసే ఆవకాశం ఉందంటున్నారు.


Click it and Unblock the Notifications











