HanuMan: హనుమాన్ నిర్మాతకు అపార నష్టం... వారికి షాకిచ్చిన నిర్మాతల మండలి
ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకటే మాట వినిపిస్తుంది. అదే హనుమాన్ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది. తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతుంది. అయితే హనుమాన్ సినిమాను కాదని వేరే సినిమాలను ప్రదర్శించారు. దీనితో హనుమాన్ నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కు అపార నష్టం వాటిల్లింది. అయితే ఈ సినిమాను ప్రదర్శించని థియేటర్ల ఓనర్లకు ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమాకు విశేష ఆదరణ వస్తుంది. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమాకు మొదట థియేటర్లు లభించలేదు. కొన్ని థియేటర్ల మాత్రమే కేటాయించారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రదర్శన విషయంలో కొన్ని థియేటర్లకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ షాక్ ఇచ్చింది.

అసలు విషయం ఏమిటంటే... ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన హనుమాన్ సినిమాను నైజాంలో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP టీం "హనుమాన్" సినిమా 12-01-2024 నుంచి ప్రదర్శించాలని తెలంగాణాలో కొన్ని థియేటర్ల వారితో ఒప్పందం చేసుకున్నారు.
అయితే ఆ థియేటర్ల ఓనర్లు ఆ అగ్రీమెంటును పట్టించుకోకుండా నైజాం ఏరియా థియేటర్లలో హనుమాన్ సినిమాను ప్రదర్శించలేదు. దానికి బదులుగా వేరే సినిమాను (గుంటూరు కారం) ను ప్రదర్శించారు. ఈ విషయమై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ - హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తెలుగు ఫిలిం ఛాంబర్ సహా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేశారు.
థియేటర్లు అగ్రీమెంటు ప్రకారం "హనుమాన్" సినిమా ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం వాటిల్లింది. దీంతో ఈ థియేటర్లు వెంటనే "హనుమాన్" సినిమా ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్టం భరించాలని ప్రోడ్యూసర్స్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల వాళ్లు చేసే ఇటువంటి చర్యల వలన తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం, నైతికత, నిబద్ధత, న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ఎగ్జిబిటర్లు వారి పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ "హనుమాన్" సినిమాకి సత్వర న్యాయం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఒక లేఖ విడుదల చేసింది.


Click it and Unblock the Notifications











