twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సచిన్ రిటైర్ మెంట్ పై తెలుగు హీరోల స్పందన

    By Srikanya
    |

    హైదరాబాద్ : 24ఏళ్లుగా క్రికెట్ ఆడుతూ ఎన్నో రికార్డులను తన పేరున లిఖించించుని అభిమానులను అలరించిన సచిన్ టెండూల్కర్ గురువారం ఉదయం వెస్టిండీస్ జట్టుతో జరిగే తన 200వ టెస్టు మ్యాచుతో క్రికెట్ జీవితానికి ముగింపు పలకనున్నాడు. గత రెండు దశాబ్ధాలుగా భారతదేశంలో క్రికెట్ అంటే సచిన్... సచిన్ అంటే క్రికెట్ అనే విధంగా మారిపోయింది. తన అద్భుత ఆట ద్వారా దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా తనకు అభిమానులను సంపాదించుకున్నాడు మాస్టర్.

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు చివరిదైన 200వ టెస్టు మ్యాచు ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం ఉదయం ప్రారంభం కానుంది. మాస్టర్ చివరి టెస్టు మ్యాచ్ కావడంతో అతని అభిమానుల్లో తీవ్ర భావోద్వేగం నెలకొంది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని మాస్టర్ అభిమానులందరూ అతని చివరి మ్యాచు వీక్షించేందుకు ఎంతో అత్రుతతో ఎదురుచూస్తున్నారు.

    అలాంటి క్రికెట్‌ దేవుడు టెస్టు మ్యాచ్‌ల నుంచి రిటైర్‌మెంట్‌ నిర్ణయం ప్రకటించాక ఈ రోజు నుంచి ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నాడు. సచిన్‌కీ, తెలుగు చిత్ర పరిశ్రమకీ మంచి అనుబంధం ఉంది. పలువురు హీరోతో ఆయనకి స్నేహం ఉంది. ఈ నేపధ్యంలో ఆయన రిటైర్మెంట్ గురించి మన హీరో,హీరోయిన్స్ చాలా ఎమోషనల్ గా మీడియాతో స్పందించారు....

    మన హీరోలు స్పందన స్లైడ్ షో లో ....

    ఎవ్వరూ ఆలోచించడం లేదు- రామ్‌

    ఎవ్వరూ ఆలోచించడం లేదు- రామ్‌

    ''నా దృష్టిలో క్రికెట్‌ కంటే గొప్ప సచిన్‌. ఆటతోనే కాకుండా... ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎలా నడుచుకోవాలో సచిన్‌ని చూసి నేర్చుకోవచ్చు. నేను క్రికెట్‌ ఆడను కానీ సచిన్‌ని ఆరాధిస్తుంటా. అయినా సచిన్‌ని ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు? చివరి మ్యాచ్‌లో ఆయన ఎలా ఆడతారు? ఎన్ని పరుగులు చేస్తారు? అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. సచిన్‌ని మైదానంలో మరోసారి చూసుకోవాలి అని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు''.

    ఏదో ఒక రోజు చూస్తా - వెంకటేష్‌

    ఏదో ఒక రోజు చూస్తా - వెంకటేష్‌

    ''సచిన్‌ ఆటని ఆస్వాదించని క్రికెట్‌ ప్రేమికులు ఎవరూ ఉండరు. ఆయన కోసమే నేను మ్యాచ్‌ని చూడటానికి వెళ్లిన సందర్భాలున్నాయి. ఆయన ఆడిన ప్రతీ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ నాకు గుర్తే. నేను, అన్నయ్య ఎప్పటికప్పుడు సచిన్‌ చేసిన స్కోరు గురించి సమాచారం ఇచ్చిపుచ్చుకొనేవాళ్లం. ఈసారి 'మసాలా' హడావుడిలో ఉండిపోవడంతో మ్యాచ్‌ చూడటానికి ఏర్పాట్లు చేసుకోలేదు. అయితే ఐదు రోజులు ఆట ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు వెళ్లి చూడాలనుకొంటున్నా''.

    అపురూపమే - కాజల్

    అపురూపమే - కాజల్


    ''దేశం మొత్తం సచిన్‌ వైపే చూస్తోంది. అందరి కళ్లూ ఆయన ఆఖరి మ్యాచ్‌పైనే ఉన్నాయి. సచిన్‌ చివరి మ్యాచ్‌ని చూసేందుకు నేను ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా. సచిన్‌ ఆటని ఆస్వాదిస్తే చాలు. ఆయన ఆడే చివరి మ్యాచ్‌ ప్రతి ఒక్కరికీ అపురూపమే అని నా అభిప్రాయం''.

    షూటింగ్ లో మ్యాచ్ చూస్తూ - మంచు విష్ణు

    షూటింగ్ లో మ్యాచ్ చూస్తూ - మంచు విష్ణు



    ''సచిన్‌కి ముందు, సచిన్‌ తర్వాత... అని క్రికెట్‌ని ప్రత్యేకంగా వేరుచేసి చూసుకోవచ్చు. ఆయన ఆటన్నా, వ్యక్తిత్వమన్నా నాకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు ఆయన ఆటని ప్రత్యక్షంగా చూశాను. నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. కాలేజీలో మా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేవాడిని. ఎన్టీఆర్‌ తర్వాత అంతటి నటుడు మళ్లీ ఎలా రాలేడో, సచిన్‌ తర్వాత అంతటి ఆటగాడు మళ్లీ పుట్టలేడు. రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణలో ఉన్నాను కాబట్టి సచిన్‌ చివరి మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూడడానికి వెళ్లలేకపోతున్నా. అయితే షూటింగ్‌లోనే మ్యాచ్‌ని చూడటానికి ఏర్పాట్లు చేసుకొన్నా''.

    స్పూర్తి పొందాలి- అల్లరి నరేష్‌

    స్పూర్తి పొందాలి- అల్లరి నరేష్‌

    ''సచిన్‌ పేరును ప్రస్తావించకుండా క్రికెట్‌ గురించి మాట్లాడలేం. ఆయన లేని క్రికెట్‌కి అలవాటు పడాలంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుంది. సచిన్‌ మైదానంలో నడుచుకొనే విధానం నన్ను బాగా ఆకట్టుకునేది. ఆయన వంద కొట్టినా, రెండొందలు కొట్టినా, అసలేం పరుగులు చేయకుండా అవుటైనా... ఒకే రకమైన భావోద్వేగాలతో కనిపిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న సచిన్‌ ఎప్పుడూ నిరాడంబరంగా గడుపుతుంటారు. ఆటగాళ్లే కాదు... ఆయన్నుంచి ఎవరైనా స్ఫూర్తిని పొందాల్సిందే. నేను చిన్నప్పట్నుంచీ సచిన్‌కి వీరాభిమానిని. ఆయన అవుటయ్యాడని తెలిస్తే చాలు... వెంటనే టీవీ కట్టేసేవాణ్ని. మాస్టర్‌ మెరుపులను మళ్లీ మైదానంలో చూడలేమన్న విషయం బాధగా ఉంది. చివరి మ్యాచ్‌లో సచిన్‌ ఎన్ని పరుగులు తీసినా ఆనందమే''.

    జీర్ణించుకోలేకపోతున్నా- శ్రీకాంత్‌

    జీర్ణించుకోలేకపోతున్నా- శ్రీకాంత్‌

    ''సచిన్‌ టెండూల్కర్‌ అనే పేరు క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రేమతో, శ్రద్ధతో ఆయన ఆడారు. వ్యక్తిగతంగా ఆయనతో నాకు పరిచయం ఉండటం నా అదృష్టం. వైజాగ్‌లో సచిన్‌తో కలిసి మ్యాచ్‌ ఆడటం నా జీవితంలో గుర్తుండిపోతుంది. డ్రెస్సింగ్‌ రూమ్‌ని పంచుకొని, కలిసి ప్యాడ్‌లు కట్టుకొని మైదానంలోకి దిగాం. సచిన్‌ ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా కలుస్తుంటాను. గుర్తుపట్టి వెంటనే పలకరిస్తారు. అలాంటి ఓ గొప్ప వ్యక్తి, గొప్ప ఆటగాడు క్రికెట్‌కి దూరమౌతున్నాడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం. సచిన్‌ చివరి మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూడలేకపోతుండడం బాధగా ఉంది. పాలకొల్లులో షూటింగ్‌లో ఉన్నాను. అయినా మ్యాచ్‌ని ఇక్కడే చూడటానికి సెట్‌లో ఏర్పాట్లు చేసుకొన్నా''

    మహేష్ సైతం...

    మహేష్ సైతం...

    సచిన్ అభిమానుల్లో ఒకరైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ నెల 14 నుంచి 18 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ ఆడే చివరి టెస్ట్ మ్యాచ్‌ చూసేందుకు ఫ్యామిలీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తన తాజా సినిమా ‘1-నేనొక్కడినే' షూటింగులో భాగంగా గోవాలో ఉన్నారు. అటు నుండి నేరుగా ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో పాటు మరికొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సచిన్ ఆడే చివరి టెస్టు మ్యాచ్ చూసేందుకు వెలుతున్నారు.

    వన్ ఇండియా సైతం...

    వన్ ఇండియా సైతం...


    1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మాస్టర్ సచిన్ టెండూల్కర్, అనాటి నుంచి ఈనాటి వరకు తన మైదానంలో తన అద్భుత ప్రదర్శనతో అభిమానులను పెంచుకుంటూనే ఉన్నారు. రెండు దశాబ్ధాలపాటు ఆధిపత్యాన్ని చలాయించిన ఈ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా తొలి టెస్ట్ మ్యాచును 51 పరుగులతో గెలుపొందిన భారత జట్టు, గురువారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే మ్యాచులో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.

    అభిమానులు పరుగులు, విజయాన్ని పక్కన పెట్టి మాస్టర్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు మ్యాచుగానే చూస్తున్నారు. ఓవెల్‌లో 1948లో డాన్ బ్రాడ్‌మన్ రిటైరైన సమయంలో నిశ్చబ్ద సంబరాలు జరిగాయి. అయితే మాస్టర్ రిటైర్మెంట్ మాత్రం గుర్తుండిపోయేలా జరుగుతోంది. మాస్టర్ చివరి మ్యాచు కావడంతో ఈ ప్రభావం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇతర సభ్యులపై కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒన్ ఇండియా గ్రూప్ తమ వెబ్ సైట్స్ లో ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్ ఇస్తోంది...మరోసారి సచిన్ కి శుభాభివందనాలు తెలియచేస్తోంది.

    English summary
    “In my opinion, Sachin is bigger than cricket”, said Ram. Allari Naresh had this to say “I cannot imagine cricket without Sachin. It will take at least two to three years to come to terms with this”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X