తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్ అరెస్టు
హైదరాబాద్: సినీ నిర్మాత సి. కల్యాణ్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. గత వారం ఓ అపార్ట్‌మెంట్ వివాదంలో డాక్టర్ కవిత అనే మహిళా వైద్యురాలిని ఆయన దుర్భాషలాడి, అసభ్యంగా ప్రవర్తించడంపై ఆమె పిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఆర్పీసీ అండర్ సెక్షన్ 41 ప్రకారం సి. కల్యాణ్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తర్వాత ఆయన వద్ద నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేసుకుని, అనంతరం అరెస్టు చేశారు. మరికొద్ది సేపట్లో స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో గల ఓ ఫ్లాట్ విషయంలో గత కొద్దిరోజులుగా డాక్టర్ కవిత, సి.కళ్యాణ్ మధ్య వివాదం నెలకొంది. ఆ ఫ్లాట్ మార్గంలో మెట్రోరైలు వెళ్తున్న నేపథ్యంలో అపార్ట్‌మెంట్ కొంతమేరకు పోయే అవకాశం ఉంది, అందుకు జీహెచ్‌ఎంసీ పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది.

అయితే వచ్చే నగదును వ్యక్తిగతంగా కాకుండా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్‌లో వేయమని సి.కళ్యాణ్ కోరగా, అందరికి వేరువేరుగా ఇవ్వాలని కవితతో పాటు మరో ఐదుగురు కోరారు. దీంతో వివాదం చెలరేగింది.
పైగా, కవితకు సంబంధించిన ఫ్లాట్‌ను కూడా తనకే అమ్మాలంటూ సి.కళ్యాణ్ బెదిరింపులకు దిగాడనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కవిత జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో సి.కళ్యాణ్‌పై 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











