Pawan Kalyan జనసేనలో చేరిన బుల్లితెర మెగాస్టార్.. పవన్ కల్యాణ్ సమక్షంలో!
తెలంగాణలో ఎన్నికల వేడి ఊపందుకొంటున్న సమయంలో పలు పార్టీల నుంచి జనసేనలోకి చేరికలు ఊపందుకొంటున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో పెద్దగా చేరికలు కనిపించని నేపథ్యంలో బుల్లితెర మెగాస్టార్‌గా ఓ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకొన్న నటుడు పార్టీలో చేరడం ఆసక్తికరంగా కనిపించింది. హైదరాబాద్‌లో జరిగిన చేరికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ పలువరిని పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. బుల్లితెర మెగాస్టార్ చేరిక విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తెలుగు టెలివిజన్ రంగంలో మొగలిరేకులు సీరియల్ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఈ సీరియల్ ద్వారా స్టార్ యాక్టర్‌గా సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు అభిమానులను, మహిళా ప్రేక్షకులను ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. ఆ మధ్యలో ఒకట్రెండు సినిమాల్లో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కొద్దికాలంగా సీరియల్స్, సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సాగర్ అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నాడు. జనసేన పార్టీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. సోమవారం నవంబర్ 6వ తేదీన జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సాధారంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకొన్నారు. పార్టీకి సేవలు అందించాలని ఆయన సాగర్‌ను కోరారు.
జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పవన్ కల్యాణ్ సమక్షంలో నటుడు సాగర్ మాట్లాడారు. జనసేన పార్టీ ప్రజల కోసం నిలబడుతున్నది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆయన ప్రజా పోరాటాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తాను అని అన్నారు. పేద ప్రజల శ్రేయస్సు కోసం నా వంతు సహకారం అందిస్తాను అని సాగర్ అన్నారు.

యాక్టర్ సాగర్ కెరీర్ విషయానికి వస్తే.. చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ ద్వారా అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్నాడు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించిన ఆయన మనసంతా నువ్వే, మిస్టర్ ఫర్‌ఫెక్ట్, సిద్దార్థ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, షాదీ ముబారక్ సినిమాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











