CCL 2023: ఫైనల్‌లోకి తెలుగు వారియర్స్.. రోషన్ మెరుపు ఇన్నింగ్స్.. చివర్లో బౌండరీతో గెలిపించిన థమన్
మన దేశంలో చాలా మందికి క్రికెట్, సినిమా అంటే ఎలాంటి ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ మ్యాచ్ జరిగానా.. ఎప్పుడు సినిమా విడుదలైన ప్రతి ఒక్కరూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అలాంటిది సినిమా వాళ్లే క్రికెట్ ఆడితే.. అదే 'సెలెబ్రిటీ క్రికెట్ లీగ్' (సీసీఎల్).
తాజా సీజన్‌లో తెలుగు వారియర్స్ టీమ్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు కర్నాటక బుల్డోజర్‌పై సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించి ఏకంగా ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

సెమీ ఫైనల్ మ్యాచ్ కర్నాటకతో
ఇండియా వ్యాప్తంగా ఎంతో ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న 'సెలెబ్రిటీ క్రికెట్ లీగ్' (సీసీఎల్) కొత్త సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇందులో గతంలో పలుమార్లు టైటిల్ గెలిచిన తెలుగు వారియర్స్ జట్టు మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి.. సెమీ ఫైనల్స్‌లో కిచ్చా సుదీప్ నేతృత్వంలోని కర్నాటక బుల్డోజర్స్ టీమ్‌తో శుక్రవారం వైజాగ్‌లో తలపడింది.

మొదటి ఇన్నింగ్స్ స్కోర్ ఇలా
సీసీఎల్ మ్యాచ్‌లు రెండేసి ఇన్నింగ్స్‌ల చొప్పున జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇక, తెలుగు వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాటక బుల్డోజర్స్ జట్టు పది ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ బౌలర్లలో యంగ్ హీరో సామ్రాట్ హ్యాట్రిక్ చేయడంతో పాటు నాలుగు వికెట్లను తీసుకున్నాడు.

తెలుగు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్
ఇక, ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా నిర్ణీత పది ఓవర్లలో 95 పరుగులు మాత్రమే చేసింది. కర్నాటక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తెలుగు వారియర్స్ బ్యాటర్లు పరుగులు చేయడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో కర్నాటక జట్టు.. తెలుగు వారియర్స్‌పై నాలుగు పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకుంది.

వాళ్లు రెండో ఇన్నింగ్స్ ఇలా
మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప (4) పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న కర్నాటక బుల్డోజర్స్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే రీతిలో బ్యాటింగ్ చేసింది. ఫలితంగా నిర్ణీత పది ఓవర్లలో ఆ జట్టు ఐదు వికెట్లను కోల్పోయి 98 పరుగులను సాధించింది. తద్వారా మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని తెలుగు వారియర్స్ ముందర కర్నాటక జట్టు 103 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

రోషన్ మెరుపు ఇన్నింగ్స్‌తో
పది ఓవర్లలో 103 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్‌కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. అశ్విన్ బాబు రనౌట్ అయ్యాడు. అయినా మరో ఎండ్‌లో రోషన్ (శ్రీకాంత్ కొడుకు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సులు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడిన ఈ కుర్ర హీరో కేవలం 9 బంతుల్లోనే 27 పరుగులు చేసి తెలుగు వారియర్స్ విజయానికి బాటలు వేశాడు.

ఫోర్‌తో ఫినీష్ చేసిన థమన్
రోషన్ మెరుపు ఇన్నింగ్స్‌తో తెలుగు వారియర్స్ జట్టు చివరి 5 ఓవర్లకు 41 పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చింది. అయితే, తర్వాత వాళ్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయండతో 2 ఓవర్లలో 23 పరుగులు అవసరం అయ్యాయి. అప్పుడు థమన్ సిక్స్, ఫోర్‌తో 9వ ఓవర్‌లో 15 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్‌కు ఎనిమిది పరుగులు కావాల్సి ఉండగా.. 4వ బాల్‌కు ఫోర్ కొట్టి గెలిపించాడు.

ఫైనల్ ఆ జట్టుతో.. ఈరోజే
తెలుగు వారియర్స్ జట్టులో నాలుగు వికెట్లు తీసిన సామ్రాట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతకు ముందు జరిగిన మొదటి సెమీస్‌లో భోజ్‌పురి దబాంగ్స్, ముంబై హీరోస్‌ను ఓడించింది. దీంతో మార్చి 25, సాయంత్రం 7 గంటల నుంచి భోజ్‌పురి దబాంగ్స్, తెలుగు వారియర్స్ జట్ల మధ్య ఫైనల్ జరగనుంది. దీనికి విశాఖపట్నంలోని స్టేడియం వేదిక కానుంది.


Click it and Unblock the Notifications











