బాధలో ఎన్టీఆర్: 10 రోజుల పాటు షూటింగ్ నిలిపివేత!
హైదరాబాద్: హరికృష్ణ పెద్ద కుమారుడు, సినీ నిర్మాత అయిన నందమూరి జానకిరామ్ యాక్సిండెటులో మరణించడంతో నందమూరి ఫ్యామిలీ, అభిమానులు విషాదంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరుగాల్సిన ‘టెంపర్', ‘పటాస్' ఆడియో ఫంక్షన్లు ఇక ఉండక పోవచ్చని తెలుస్తోంది. డైరెక్టుగా ఆడియోను మార్కెట్లోకి విడుదల చేస్తారని సమాచారం.
కాగా...‘టెంపర్' షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉంది. అయితే జూ ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ మరణంతో ఆయన తీవ్రమైన బాధలో ఉన్నారు. ఆయన షూటింగులో పాల్గొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ‘టెంపర్' షూటింగ్ 10 రోజుల పాటు నిర్మాత నిలిపివేసినట్లు యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతోంది.

యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.
కెనిడయన్ మోడల్ అయిన నోరా ఫటేహి ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











