చరణ్, ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ హీరోయిన్లు.. ఆ ముగ్గురిలో ఎవరో డిసైడ్ కాలేకున్న రాజమౌళి!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత మరో అద్భుతానికి శ్రీకారం చుట్టారు. సౌత్ ఇండియాలోనే ఇది భారీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలిని మించేలా ఉండడానికి రాజమౌళి పెద్ద కసరత్తే చేస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ లుక్స్ డిఫెరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం రాజమౌళి పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విభిన్నంగా పాత్రలు
ఈ చిత్రంలో ప్రతి పాత్ర విభిన్నంగా ఉండేలా రాజమౌళి డిజైన్ చేస్తున్నారు. స్వాతంత్ర సమర నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాంచరణ్ బ్రిటిష్ కాలం నాటి పోలీస్ అధికారిగా, ఎన్టీఆర్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం తమిళ దర్శకుడు సముద్రఖనిని రాజమౌళి ఇటీవల ఎంపిక చేశారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో కాస్టింగ్ ని విస్తృతపరిచే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం 2వ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

హీరోయిన్ల విషయంలో సందిగ్దత
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. మొదట ఈ చిత్రం కోసం కీర్తి సురేష్, సమంత లాంటి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ రాజమౌళి ఖరారు చేయలేదు. ప్రస్తుతం రాజమౌళి చూపు బాలీవుడ్ హీరోయిన్లపై పడ్డట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరోయిన్లతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఆ ముగ్గురిలో ఎవరు
కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ చిత్రంలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా పేరు వినిపించింది. ఆమె అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా చిత్ర యూనిట్ ఆమెవైపు మొగ్గుచూపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సోనాక్షి సిన్హా, అలియా భట్ లతో కూడా రాజమౌళి సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభమైపోవడంతో హీరోయిన్లని ఎంపిక చేసి షూటింగ్ లోకి దింపాలని రాజమౌళి భావిస్తున్నాడు.

2020లో విడుదల
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











