ట్రైలర్ టాక్: 'తుఫాన్' కాదు...సునామి
హైదరాబాద్ : 'జంజీర్'తో (తెలుగులో తుఫాన్) రామ్ చరణ్ బాలీవుడ్ బాట పట్డారు. ఈ చిత్రం ట్రైలర్ ని చిరు ఆవిష్కరించి మార్కెట్ లోకి వదిలారు. ఆ ట్రైలర్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని విశేషంగా అలరిస్తోంది. ఆ ట్రైలర్ చూసిన వారు... 'తుఫాన్' కాదు...సునామి అని అంటున్నారు. అమితాబ్‌బచ్చన్‌కి యాంగ్రీ యంగ్‌మెన్ హోదా ఇచ్చిన సినిమా 'జంజీర్'. బాలీవుడ్‌లో ఓ మేటి చిత్రం. ఆ పాత్ర పోషించాల్సివచ్చినప్పుడు తాను జాగ్రత్తలు తీసుకొనే నటించానంటున్నారు రామ్ చరణ్.
రామ్ చరణ్ మాట్లాడుతూ...అసలు 'జంజీర్' చేయాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే తెలుగులో నా సినిమాలతో నేను బిజీగా ఉన్నా. మరోవైపు 'జంజీర్' సినిమా అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే.. నేను నో చెప్పా. కానీ డాడీ మాత్రం ఓ మాట అన్నారు. 'కథ నీకు నచ్చకపోతే వదిలేయ్. భయపడి మాత్రం సినిమా చేయడం మానొద్దు' అన్నారు. కథగా 'జంజీర్' బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో అమితాబ్‌ని నేను అనుకరించలేదు. నా శైలిలో చేసుకొంటూ వెళ్లా. ఇదో మేటి సినిమాకి రీమేక్ అనే ఆలోచన కూడా మదిలో రానివ్వకుండా జాగ్రత్త పడ్డా అన్నారు.
ఈ చిత్రంలో షేర్‌ఖాన్ పాత్రలో శ్రీహరి నటించాడు. బిజీ షెడ్యూల్‌లోనూ ఈ పాత్రకి అంగీకరించరాయన. 'మగధీర' జోడీగా చరణ్-శ్రీహరి మరోసారి అలరించనున్నారు. ప్రకాష్‌రాజ్ విలనీ హైలైట్. పోలీస్ గొప్పతనాన్ని చాటిచెప్పే గొప్ప చిత్రమిది. మాస్ కమర్షియల్ హిట్ సాధించనున్నారు .
హిందీ, తెలుగు వెర్షన్ల చిత్రీకరణ పూర్తయిందని ప్రియాంక చోప్రా తెలిపారు. దర్శకుడు అపూర్వ లఖియా, నిర్మాతలు అమిత్, రామ్, సాకేత్, నటుడు శ్రీహరి, అల్లు అరవింద్, నాగబాబు, మహేష్ రామనాథమ్, తనికెళ్ల భరణి, చంద్రబోస్ తదితరులు వేడుకలో పాల్గొన్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫ్లైయింగ్ టర్టిల్ ఫిలిమ్స్, రామ్‌పేజ్ మోషన్‌పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కెమెరా: గురురాజ్.


Click it and Unblock the Notifications











