కొట్టలేదు, నా ఫోటో మార్పింగ్ చేసారు : మీడియాపై రామ్ చరణ్ ఫైర్
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో రామ్ చరణ్ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మీడియా మొత్తం తననే తప్పుపడుతూ కథనాలు ప్రచురించడం రామ్ చరణ్ అసంతృప్తి వ్యక్తం చేసారు. అలాగే ఈ సంఘటనలో తాను రోడ్డుపై ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన ఫోటోలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు చరణ్ గురువారం సాయంత్రం హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.
తాను ఎవరిపై దాడి చేయలేదని చెప్పిన రామ్ చరణ్, అసలు సంఘటన జరిగినప్పుడు తాను కారు దిగలేదని, భార్యతో కలిసి కార్లోనే కూర్చున్నట్లు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని, వారు చూస్తే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలా లేరని, వారు తన కారు దగ్గరకు వచ్చి గొడవ చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించారని చరణ్ చెప్పుకొచ్చారు. తన సెక్యూరిటీ సిబ్బంది వారితో తోపులాటకు దిగారే తప్ప ఎవరినీ కొట్టలేదని వెనకేసుకొచ్చారు చరణ్.
పత్రికల్లో తాను సంఘటన స్థలంలో ఉన్నట్లు ఫోటోలు ప్రచురితం అయ్యాయని, అవి మార్ఫింగ్ చేసినవే అంటూ రామ్ చరణ్ మీడియా ముందు సాక్ష్యాలు ప్రదర్శించారు. ఈ ఫోటోలను అడ్డుపెట్టుకుని ఓ ఫోటోగ్రాఫర్ తన వద్ద నుంచి డబ్బు గుంజాలని చూసాడని కూడా చరణ్ చెప్పుకొచ్చారు.
ఈ వ్యవహారంలో తాను హుందాగా వ్యవహరించానని, ఆ సమయంలో తాను కారు దిగి ఉంటే సీన్ వేరేలా ఉండేదని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లదే తప్పని చరణ్ నొక్కి వక్కానించారు. వారని భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తాను పోలీసులు ఫిర్యాదు చేయలేదని, దీనిపై అనవసర రాద్దాంతం వద్దని, మీడియా కూడా ఈ విషయాన్ని వదిలి పెట్టాలని రామ్ చరణ్ సూచించారు. దీన్నో బ్యాడ్ ఇన్సిడెంట్ గా రామ్ చరణ్ పేర్కొన్నారు.
దాడి జరిగినా మీరు దాడి జరుగలేదని అంటున్నారు. దాడి జరిగింది అనడానికి సాక్ష్యాలు ఉన్నాయని పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించగా....చరణ్ సమాధానాలు చెప్పడానికి నిరాకరించి, అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లి పోయారు.


Click it and Unblock the Notifications












