జులాయి బ్లాక్ టిక్కెట్స్ అమ్మకం: ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: అల్లు అర్జున్, ఇలియానా నాయకా, నాయికలుగా వచ్చిన జులాయి చిత్రం టిక్కెట్స్‌ను బ్లాక్‌లో అమ్మేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు గురువారం హైదరాబాదులో అరెస్టు చేశారు. బ్లాక్ టిక్కెట్స్ అమ్మకానికి ప్రయత్నించిన నగరంలోని చిలకలగూడలోని శ్రీదేవి థియేటర్ బుకింగ్ క్లర్క్ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జులాయి చిత్రం గురువారం విడుదలయిన సంగతి తెలిసిందే. బ్లాక్ టిక్కెట్స్ అమ్ముతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు శ్రీదేవి థియేటర్ టాకీస్ ప్రాంగణంలో రైడ్ చేశారు. ఈ సందర్భంగా వారు టిక్కెట్లను అమ్మ యత్నించిన వారిని గుర్తించారు. పోలీసులు రూ.950ల విలువ చేసే 34 టిక్కెట్లను బ్లాక్ టిక్కెట్ విక్రయదారుల నుండి స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారు.. ఎల్లయ్య, విజయ్ కుమార్, రమేష్‌లుగా పోలీసులు గుర్తించారు. ఎల్లయ్య థియేటర్లో బుకింగ్ క్లర్క్‌గా పని చేస్తున్నాడని, విజయ్ కుమార్ పువ్వులు అమ్ముతుంటాడని, రమేష్ థియేటర్ ఎదుట ఓ పాన్ షాప్ నడుపుతున్నాడని పోలీసులు చెప్పారు.
బుకింగ్ క్లర్క్‌గా పని చేస్తున్న ఎల్లయ్య జులాయి టిక్కెట్స్‌ను విజయ్ కుమార్, రమేష్‌లకు బ్లాక్‌లో అమ్మేందుకు సరఫరా చేశాడని పోలీసులు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ సినిమా రెగ్యులేషన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.


Click it and Unblock the Notifications











