ఏపీలో సినిమా టికెట్ల పెంపు వివాదం.. హైకోర్టు ఉత్తర్వులపై వైఎస్ జగన్ సర్కార్ సవాల్?
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల పెంపు వివాదం మరింత రాజుకొనేలా కనిపిస్తున్నది. గతంలో టికెట్ల రేట్ల పెంపుపై పరిమితి, ఆంక్షలు విధిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ జీవోను జారీ చేసింది. అయితే టికెట్ల రేట్లు పెంచుకొనేలా వెసులుబాటు కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మంగళవారం (డిసెంబర్ 14వ తేదీన) విచారించారు. ప్రభుత్వ జీవో అమలును నిలిపివేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదంలోకి వెళితే..

ఏప్రిల్ 8వ తేదీన 35 జీవో
తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లలో తమకు నచ్చిన విధంగా, సినిమా బడ్జెట్‌ను బట్టి టిక్కెట్లు రేట్లు పెంచుకొనే విధంగా ఉండేది. అలాగే భారీ బడ్జెట్ చిత్రాలు, అగ్రహీరోల సినిమాలు విడుదలైన సమయంలో అదనపు షోలను ప్రదర్శించే వారు. అయితే అలాంటి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఏప్రిల్ 8వ తేదీన జీవో 35ను జారీ చేసింది. అయితే ఆ జీవో తమ ప్రయోజనాలు, సినిమా పరిశ్రమ అభివృద్ధికి నిరోధకంగా నిలిచిందంటూ సినిమా థియేటర్ల యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు పిటిషన్ దాఖలు చేశారు.

జీవో 35ను నిలిపివేసిన హైకోర్టు
అయితే టికెట్ల పెంపు, సినిమాల ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ స్పందిస్తూ.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉంది. గతంలో థియేటర్ల యాజమాన్యాలు ఏ విధానంలో అయితే టికెట్ రేట్లను నిర్ణయించారో అదే పద్దతిని పాటిస్తూ టికెట్ రేట్లను పెంచుకోవచ్చని వెసులుబాటును కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

రెండు కీలక అంశాలపై ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 35 జీవోలో రెండు అంశాలను ఆధారంగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు ఇచ్చారు. టికెట్ రేట్ల పెంపుపై అధ్యయనానికి హోంశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీని చైర్మన్ ఉంచాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే అలా కాకుండా ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శని కేవలం సభ్యుడిగానే ఉంచారు. అందుబల్ల జీవో 35 అమలును నిలిపివేస్తున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా భౌగోళిక ప్రాంతాల ప్రకారం ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.

హైకోర్టులో భారీగా వాదోపవాదనలు
టికెట్ల రేట్లు పెంపు వివాదంపై ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. టికెట్ ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది. బడ్జెట్ ఆధారంగా టికెట్లు ధరలను నిర్ణయించడం సరికాదు. ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ధరలను నిర్ణయించిందని చెప్పారు. అయితే థియేటర్ యాజమాన్యాల తరఫున వాదించిన బి ఆదినారాయణరావు.. సినీ పరిశ్రమతో ముడిపడి ఉన్న వారి అభిప్రాయాలు తీసుకోకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొందనే తన వాదనలు వినిపించారు.

హైకోర్టు ఉత్తర్వులను సవాల్?
ఇదిలా ఉండగా, టికెట్ల రేట్ల పెంపు, ప్రత్యేక షోల ప్రదర్శనపై హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే విషయం వెలుగు చూసింది. జీవో 35ను అమలు చేసేలా, సామాన్య ప్రజలకు సినిమా టికెట్లు అందుబాటులో ఉండేలా ఏపీ ప్రభుత్వం అప్పీల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన వస్తే గానీ.. ఈ విషయంలో స్పష్టత ఉంటుందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











