పులిని దత్తత తీసుకున్న యంగ్ హీరో
ముంబై : ప్రముఖ నటుడు జాకీష్రాఫ్ కుమారుడైన టైగర్ ష్రాఫ్ 'హీరోపంతీ' (పరుగు రీమేక్) చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న చిత్రం తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పరుగు'కు రీమేక్ కావడం చెప్పుకోదగ్గ విషయం. తల్లిదండ్రులు జాకీష్రాఫ్-ఆయేషాలు టైగర్‌కు ఈ పేరు పెట్టడం వెనుక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ఈ విషయాన్ని టైగర్ తన హీరోపంతీ చిత్రం ప్రచార సమయంలో పలుమార్లు చెప్పారు.

చిన్నతనంలో ఈ అబ్బాయి తోటి పిల్లలను కొరకడం, రక్కడంతో పాటు తన చేష్టలతో అందరినీ హడలెత్తించేవాడట. అందుకే అమ్మా, నాన్నలు 'టైగర్' అని ముద్దుగా పిలుచుకునేవారట. అదే ఈ కండల హీరోకి స్థిరపడిపోయింది. రోజు రోజుకూ తగ్గిపోతున్న ఈ పులుల సంఖ్య టైగర్‌ను ఆలోచింపజేసింది. అవి మనుగడ సాగించడం కోసం తన వంతు సాయం చేసేందుకు నాగపూర్‌లోని ఒక జంతు ప్రదర్శనశాలలో ఉన్న 'జాన్' అనే నాలుగు సంవత్సరాల వ్యాఘ్రాన్ని దత్తత తీసుకున్నాడు.
పులి అంత రాజసాన్ని ఒలకబోసే జంతువు సృష్టిలో మరొకటి లేదన్నది టైగర్ అభిప్రాయం. అందం, శక్తి, నిర్భీతి వంటి అపూర్వ లక్షణాల సంగమం పులి అని అంటాడీ యువ నటుడు. ఈ లక్షణాలే తాను నటుడిగా ఎదగడంలో ఎంతో తోడ్పడ్డాయంటాడు టైగర్.


Click it and Unblock the Notifications











