ఎన్టీ రామారావు భార్యను కొట్టేవారు కాదు... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎందుకలా చూపించారో?
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ విడుదలైన ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసింది. ఇందులో ఎన్టీ రామారావు తన భార్య లక్ష్మీ పార్వతిని కొడుతున్న సీన్ కూడా ఉండటం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఎన్టీ రామారావు ఉన్నపుడు ఆయన దగ్గర పని చేసిన తిప్పరాజు రమేష్ బాబు అనే వ్యక్తి ఈ ట్రైలర్‌పై స్పందించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ చూశాను. చాలా బావుంది. రామ్ గోపాల్ వర్మ గత ఐదు పది సంవత్సరాలుగా తీసి, ఫెయిల్యూర్ అయిన సినిమాల్లో ఎంత డబ్బు పోగొట్టుకున్నాడో ఆ డబ్బంతా ఈ ఒక్క సినిమా ద్వారా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఎన్టీఆర్ తన భార్యను కొట్టడం నిజం కాకపోవచ్చు
ఈ టీజర్ చూసిన తర్వాత కొన్ని నిజాలు మాట్లాడాలనిపించింది. ఆవిడే చెప్పిందని కొన్ని వార్త కథలు ఉన్నాయి.. ఎన్టీ రామారావుగారు నన్ను అప్పుడప్పుడూ కొట్టేవారని. అది నిజంగా జరిగి ఉండక పోవచ్చు. కానీ ఆవిడను హరికృష్ణ కొట్టాడు, బాలకృష్ణ కొట్టాడు, చంద్రబాబు నాయుడు కొట్టాడు. లక్ష్మీ పార్వతిని తీసుకెళ్లి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ దగ్గరున్న గెస్ట్ హౌస్ లో బంధించిన రోజులు కూడా ఉన్నాయని తిప్పరాజు రమేష్ బాబు తెలిపారు.

ఎన్టీ రామారావు పరువు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంది
ఈ సినిమాతో లక్ష్మీ పార్వతి మీద ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు తెరపడబోతోంది. బాలకృష్ణ తన అభిమానులనే కొడతాడు. ఈ ట్రైలర్లో ఎన్టీ రామారావు లక్ష్మి పార్వతిని కొట్టిన సీన్ చూపించడం వల్ల... తండ్రికి తగ్గ తనయుడు, ఎన్టీ రామారావే కొట్టేవాడు కదా, బాలకృష్ణ అదే రక్తం కాబట్టి ఆ అలవాటు వచ్చిందని ఎన్టీ రామారావు పరువు ప్రతిష్టలు దెబ్బతినే అంశంగా నేను భావిస్తున్నాను ఒక అభిమానిగా... అని తిప్పరాజు రమేష్ బాబు వ్యాఖ్యానించారు.

వారు ఎంతో ప్రేమగా ఉండేవారు
ఎన్టీ రామారావుగారు లక్ష్మీ పార్వతిని కొట్టాడనే విషయాన్ని మాత్రం నేను నమ్మలేదు. వారు ఇంట్లో ఉన్నపుడు చాలా ప్రేమగా సంస్కృతంలో మాట్లాడుకునేవారు. వారు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం అయ్యేది కాదు, పక్కనున్న నాకు కూడా అర్థం అయ్యేది కాదు. ఎన్టీ రామారావుగారు ఉదయాన్నే నిద్ర లేవగానే... ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని.. కన్నులలో కొందు దాచుకొందు నిన్నే నా స్వామి' ఈ పాట ఇద్దరూ రోజూ ఒకరిని చూసి ఒకరు పాడుకునేవారు.

ఎన్టీ రామారావుకు పక్షవాతం వచ్చింది
అంత ఆప్యాయంగా ఉన్న కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కొందరు చేసిన కుట్రలు, కుతంత్రాలతోనే ఆ సంసారంలో చీలికలు, రాజకీయ మార్పిడిలు జరిగాయి. ఎన్టీ రామారావుగారికి పక్షవాతం వచ్చిన మాట నిజమే. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. ఆయనకు పక్షవాతం వచ్చి చేతులు పని చేయనిరోజున లక్ష్మీ పార్వతి ఈ విధంగా అన్నం కలిపి నోట్లో ముద్దులు పెట్టేవారు అంటూ ఓ ఫోటోను కూడా తిప్పరాజు రమేష్ బాబు చూపించారు.


Click it and Unblock the Notifications











