పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీతో సామాజిక తెలంగాణ అని చిరంజీవి తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సామాజిక తెలంగాణ అని తర్వాత జై సమైక్యాంధ్ర అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏముఖం పెట్టుకుని తమ్ముడు వస్తున్నాడని ప్రశ్నించారు. పీఆర్పీ తప్పిదాలకు ముందుగా క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ ప్రజాజీవితంలోకి రావాలన్నారు. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఖాయమైంది. 'జన సేన' పేరుతో రాజకీయ పార్టీ స్థాపించనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే విషయమై అభిమాన సంఘాల నేతలు, సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలోని కొందరు మేధావులతో చర్చించారు. పార్టీ పెట్టాలా? స్వతంత్రంగా పోటీ చేయాలా? ఏదైనా పార్టీలో చేరాలా? అన్నదానిపై చర్చలు జరిగాయి. చివరకు సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించారు.

అభిమానుల నడుమ హైటెక్స్‌లో జరిగే బహిరంగ సభలో పవన్ ఈ విషయం చెప్పనున్నారు. ఇప్పటికే హైటెక్స్‌లో సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు చేయాల్సిన ప్రసంగం పైనా పవన్ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారని సమాచారం. రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నది? ఆశయాలు? లక్ష్యాలు ఏంటి? ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను కూడా ఇందులో స్పృశించనున్నారు. 45 నిమిషాల సేపు ఆయన ప్రసంగం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా ఆయన పార్టీ పెడుతున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ బుధవారమిక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీకి ఏ పేరు పెట్టాలన్న దానిపైనా పలు చర్చలు జరిగాయి. జనం కోసం పార్టీ పెడుతున్నందున 'జన సేన' అంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అదే పేరు ఖరారు చేశారని తెలిసింది.
పవన్ ఇప్పటికే తన పార్టీ జెండా...అజెండా, ఎన్నికల గుర్తు అన్నింటిపైనా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే వీటిని ఆ సభలోనే పవన్ బహిర్గతం చేస్తారని తెలిసింది. అయితే అజెండా మొత్తాన్ని కాకుండా స్థూలంగా పార్టీ లక్ష్యం ఏంటి? విధానాలేంటన్నది ప్రకటించే అవకాశాలున్నాయి. హైటెక్స్‌లో జరిగే సభలో సాయంత్రం 6.30 గంటలకు ఆయన తన ప్రసంగం ప్రారంభిస్తారని సమాచారం. ప్రసంగం ఎలా ఉండాలన్న దానిపై తనకు సన్నిహితంగా ఉన్న ఒక సినీ దర్శకుడితో చర్చించి ఖరారు చేశారని తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలమంది అభిమానులు ఈ సభకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు హైటెక్స్‌లో ఒక భారీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సభలో పవన్ ఇచ్చే ప్రసంగాన్ని రాష్ట్రంలోని కొన్ని సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. దీనికోసం థియేటర్ల యజమానులతో పవన్ సన్నిహితులు మాట్లాడుతున్నారని తెలిసింది. మరోవైపు అభిమానులు కూడా ఎక్కడికక్కడ భారీ స్క్రీన్‌లు ఏర్పాటుచేసుకుని పవన్ ప్రసంగాన్ని చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీని ప్రకటించిన తర్వాత నాలుగైదు రోజులు హైదరాబాద్‌లో ఉండి పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. అనంతరం ప్రజల్లోకి వెళ్తారని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని తెలిసింది.


Click it and Unblock the Notifications











