రసరమ్యనటీమణి 'రమ్యకృష్ణ'
దశాబ్దానిక పైగా కుర్రకారుని ఉర్రూతలూగించిన రసరమ్యనటీమణి రమ్యకృష్ణ. ఈ రోజు(సెపెంబరు 15) ఆమె పుట్టినరోజు. కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యం పొందిన రమ్య ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు. తన పదమూడవ ఏటనే 'ఏళ్ళై మనసు' అనే తమిళ చిత్రం ద్వారా కథానాయిక పరిచయమైన రమ్య, నాగార్జున కథానాయకుడుగా నటించిన 'సంకీర్తన' చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. అనతి కాలంలోనే అగ్రనాయికగా ఎదిగిన రమ్యకృష్ణ అటుపైన అందరి అగ్రహీరోల సరసనా నటించి మెప్పించింది.
దక్షిణాది చిత్రాలన్నీ కలిపి 200 పైగా చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ సౌంత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ధీటుగా 'నరసింహ' చిత్రంలో 'నీలాంబరి' పాత్రలో నటించి విమర్శకుల ప్రసంసలు అందుకుంది. తెలుగులో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సూత్రధారులు' చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'అల్లుడు గారు', 'అల్లరి మొగుడు' చిత్రాలు రమ్యకృష్ణ కెరీర్ ను తారా స్థాయికి తీసుకెళ్లాయి. అటుపైన గ్లామర్ హీరోయిన్ గా, బాధ్యతగల ఇల్లాలుగా, అమ్మవారుగా పలు రకాలైన పాత్రలు పోషించిన రమ్యకృష్ణ, 'చంద్రలేఖ' సినిమా సమయంలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2003, జూన్ 11న వివాహం చేసుకున్నారు. వీరికి రిత్విక్ అనే బాబు కూడా వున్నాడు. వివాహానంతరం సినిమాలు తగ్గించుకున్న రమ్య అడపాదడపా తెరపై కనిపిస్తున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని దట్స్ తెలుగు తరపున జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాము.


Click it and Unblock the Notifications











