డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు, డైలాగ్ రైటర్ అరెస్ట్.. భారీగా కొకైన్, గంజాయి సీజ్!
తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా డ్రగ్స్ దందాపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. పక్కా సమాచారంతో మెరుపు దాడులు నిర్వహిస్తూ సినీ ప్రముఖులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వినియోగం, రవాణా తదితర అంశాల ఆరోపణలపై సినీ దర్శకుడు, డైలాగ్ రైటర్‌ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. డ్రగ్స్ కేసులో మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసిన వివరాల్లోకి వెళితే..
గత కొద్ది వారాలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పక్కాగా దాడుల చేస్తున్నారు. ముందస్తు సమాచారంతో డ్రగ్స్ పార్టీలపై రైడ్స్ చేస్తున్నారు. ఇటీవల దాడుల్లో సినీ హీరో నవదీప్ పేరు ప్రముఖంగా వినిపించింది. నవదీప్, ఇతర సినీ ప్రముఖుల గురించి వెతుకుతున్నారు. ఈ క్రమంలో అందిన సమాచారంతో సోమవారం మరో మెరుపుదాడి నిర్వహించారు.

సోమవారం జరిగిన దాడిలో బస్తీ సినిమా డైరెక్టర్ మంతెన వాసువర్మను అదుపులోకి తీసుకొన్నారు. వాసూ వర్మతోపాటు సినీ రచయిత మన్నేరి పృథ్వీ కృష్ణను కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరి నుంచి 70 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాకుండా భారీ మొత్తంలో విదేశీ మద్యం, గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన దర్శకుడు వాసు వర్మ, మన్నేరి పృథ్వీ కృష్ణను అదుపులోకి తీసుకొన్నారు. వారి పార్టీలో ఇంకా ఎవరు ఉన్నారు అనే వివరాలను సేకరిస్తున్నారు. తమ అదుపులో ఉన్న వారిని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వారిద్దరిపై 579/2023, 698/2023 ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, డ్రగ్స్ కేసులో మరికొందరు సినీ తారలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొనేందుకు పక్కాగా ఆధారాలు, సాక్ష్యాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఆధారాల ప్రకారం వారిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. హీరో నవదీప్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు.


Click it and Unblock the Notifications











