టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. సూపర్ హిట్ పాటలు అందించిన ప్రముఖ లిరిసిస్ట్ మృతి..
టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్య కారణాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ మరణవార్త ఇంకా మరువకముందే మరో సినీ గేయ రచయితను టాలీవుడ్ కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అనారోగ్య కారణాలతో మృతిచెందారు. అయితే ఆయన ఎలా మృతి చెందారు ? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

క్యాన్సర్ తో పోరాడి గెలిచి
ప్రముఖ టాలీవుడ్ లిరిసిస్ట్ కందికొండ యాదగిరి మృతి చెందారు. క్యాన్సర్ తో పోరాడి గెలిచిన ఆయన అనారోగ్య కారణాలతో మరణించారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి అని సమాచారం. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అనేక పాటలను ఆయన తెలుగుసినీ పరిశ్రమకు అందించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పొందారు. కందికొండను తెలుగు చిత్ర పరిశ్రమకు దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి పరిచయం చేయగా ఎక్కువ ఆయన పూరి జగన్నాథ్ సినిమాలకే పని చేశారు.

స్పైనల్‌కార్డ్ దెబ్బతిన్నా
గత రెండేళ్లుగా కందికొండ క్యాన్సర్ తో బాధపడుతుండగా.. కీమో థెరపీతో స్పైనల్ కార్డ్ పూర్తిగా దెబ్బతినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆరోగ్యం విషమించడంతో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారని అంటున్నారు. క్యాన్సర్ మహమ్మారి నుంచి రెండేళ్లు అలుపు సొలుపు లేకుండా పోరాడిన కందికొండ ఆ మహమ్మారి నుంచి ఎట్టకేలకు బయటపడ్డారు. కానీ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమో థెరపీ చేయించుకోవడంతో.. కందికొండ స్పైనల్‌కార్డ్ లోని సీ1 సీ2 భాగాలు దెబ్బతిన్నాయి.

నడవలేని స్థితిలోకి
దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. తొందరగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని కందికొండను పరీక్షించిన డాక్టర్లు చెప్ప్పడంతో ఆ సమయంలో ఆయన చికిత్సకు భారీగా ఖర్చవుతుండటంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. తండ్రి అనారోగ్యం కారణంగా తమ కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితి వివరిస్తూ కందికొండ కుమార్తె మాతృక మంత్రి కేటీఆర్ కు లేఖ రాయగా ఆ సమయంలో ఆయన అండగా నిలిచారు.

'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' సినిమాతో
కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామని అప్పట్లో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కందికొండ కుటుంబం విషయంలో తన ఆఫీసు సిబ్బంది, మంత్రి తలసానితో మాట్లాడి సాయం చేస్తారని భరోసా ఇచ్చారు. తెలుగు సినీ గేయ రచయితగా కందికొండకు మంచి పేరుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంలో 'మళ్లి కూయవే గువ్వ' పాటతో ఆయన గేయ రచయితగా కెరీర్ మొదలు పెట్టారు.

సినీ ప్రముఖుల సంతాపం
అలా ఆ తర్వాత 'ఇడియట్'లో 'చూపుల్తో గుచ్చి గుచ్చి', 'సత్యం'లో 'మధురమే మధురమే', 'ఐయామ్ ఇన్ లవ్', 'పోకిరి'లో 'గల గల పారుతున్న గోదారిలా' 'జగడమే', 'లవ్‌లీ'లో 'లవ్‌లీ లవ్‌లీ' తదితర పాటలు అందించారు. ఇక చివరిగా కందికొండ 2018లో 'నీది నాది ఒకే కథ'లో రెండు పాటలు రాశారు. అయితే స్వతాహాగా తెలంగాణ ప్రాంత వ్యక్తి కావడంతో తెలంగాణ పండుగలైన బోనాలు, బతుకమ్మతో పాటు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే పలు పాటలను కందికొండ రాశారు. కందికొండ మృతి విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications